నల్లధనంపై అత్యధిక పన్ను


అవినీతిపరుల్ని ప్రభుత్వం వదిలేస్తుంది అనే భ్రమలు ఏవైనా ఉంటే వదిలేయండి! పెద్ద నోట్ల రద్దు తర్వాత లక్షలాదిమంది సమర్పించిన రిటర్న్స్ సవరణల్ని, వాటిలో కొత్తగా చూపిన ఆస్తులని, ఆదాయమార్గాలను, ఒక్కసారిగా వచ్చిపడిపోయిన లాభాల ని నిశితంగా పరిశీలించే పని మొదలైంది. ఆదాయం, ఆస్తుల్లో కొంచెం అటూ ఇటూ ఉంటే ఫర్వాలేదు కానీ... భారీ వ్యత్యాసాలుంటే కొరడా దెబ్బలకు సిద్ధపడాల్సిందే!

నోట్ల రద్దు తర్వాత లెక్కల్లో లేని సంపదని చాలామంది దగ్గర కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నల్లధనంపై అత్యధిక పన్ను రేటు విధించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తాజాగా ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది. నోట్ల రద్దు తరువాత అనేకమంది ‘సవరించిన ఆదాయపు పన్ను రిటర్ను’లను ఐటీ శాఖకు సమర్పించారని బోర్డు పేర్కొంది. వీటిని నిశితంగా తనిఖీ చేసి ఇంతకుముందు లెక్కల్లో చూపని ఆదాయాన్ని గుర్తించాలని సూచించింది. ఆదాయపు పన్ను చట్టంలోని 115బీబీఈ సెక్షన్‌ కింద నష్టాలు, ఖర్చుల నిమిత్తం ఇచ్చే మినహాయింపులు ఈ సందర్భంగా వర్తించవని స్పష్టం చేసింది. అధిక అమ్మకాలతో అత్యంత ఎక్కువ ఆదాయం వచ్చినట్టు కూడా కొందరు పేర్కొన్నారని, ఆ వివరాలను వ్యాట్‌, కేంద్ర ఎక్సయిజ్‌ రిటర్నులతో పోల్చి చూసి అప్పుడే నిర్ధారించాలని పేర్కొంది. సవరించిన రిటర్నులను దాఖలు చేయడమంటే దానర్థం నల్లధనాన్ని చట్టబద్ధం చేసుకోవడం కాదని బోర్డు స్పష్టత ఇచ్చింది. తొలి రిటర్నుకు, సవరించిన రిటర్నుకు భారీ తేడాలుంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.

ముఖ్యాంశాలు