ఫలక్ నుమా ప్యాలస్ లో విందు అంటేనే రాజసం


101 మంది ఒకేసారి కూర్చోవడానికి వీలయ్యే టేబుల్‌ ఉన్నది ఎక్కడంటే ఫలక్ నుమా ప్యాలస్ లో. కుడివైపున 50 మంది, ఎడమవైపున 50 మంది కూర్చునే ఏర్పాట్లుం టాయి దీనికి. టేబుల్‌ మధ్యలో అంగుళం ఎత్తులో ఉండే పెద్ద కుర్చీ ప్రధాన అతిథి కోసం ఉంటుంది. షాండ్లియర్‌ కాంతులు, పసిడి పూతలతో నిండిన ఈ డైనింగ్ హాల్ సమస్తం రాజసానికి ప్రతీకగా మెరిసిపోతుంది. ఇప్పుడీ ప్యాలస్ లోనే విశిష్ట అతిథి ఇవాంక ట్రంప్ గౌరవార్థం, ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ప్రతినిధుల గౌరవార్థం భారత ప్రభుత్వం విందు ఇస్తున్నది. ఈ విందుకు ప్రధాన వేదిక అయిన ఫలక్ నుమా ప్యాలస్ ప్రధాన డైనింగ్ హాల్ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. నిజాం ప్రధానిగా పనిచేసిన నవాబ్‌ వికార్‌ ఉల్‌ ఉమ్రా 1893లో దీనిని రూపొందించారు. దీనికోసం ఫ్రాన్స్‌ నుంచి నిపుణుల్ని రప్పించారు. అప్పట్లో రాజకుటుంబీకులకు భోజన ఏర్పాటు చూసేందుకు 25 మంది పనిచేసేవారు. గోడలపై ఉన్న ఆహారపదార్థాల చిత్రాల్ని చూపి (మెనూ అన్నమాట) నవాబు రాజులు నచ్చిన భోజనం తయారు చేయించుకునేవారట. ఇతర దేశాల రాజులూ ఇక్కడ భోజనం చేసారు. నిజాం వారసుల నుంచి 2010లో దీన్ని తాజ్‌హోటల్స్‌ గ్రూప్‌ అద్దెకు తీసుకుని ‘తాజ్‌ ఫలక్‌నుమా హోటల్‌’గా పేరు మార్చింది. దీన్ని ప్రారంభించినప్పుడు సచిన్‌ తెందుల్కర్‌, కరీనా తదితర ప్రముఖులెందరో విందు ఆరగించారు. అన్నట్టు ఇది విఐపిల కోసం మాత్రమే కాదు. ఎవరైనా తినొచ్చు. కానీ ఈ టేబుల్‌పై భోజనానికి కనీసం 40 మంది గ్రూపు ఉండాలి. అప్పుడే దీనిపై భోజనం పెడతారు. ఒక్కో భోజనం దాదాపు రూ.18 వేలు అవుతుందట. నచ్చిన పదార్థాలన్నీ అపరిమితంగా ఎంతకావాలంటే అంత ఆరగించవచ్చు. 80 అడుగుల పొడవు, 5.7 అడుగుల వెడల్పు, 2.7 అడుగుల ఎత్తుతో ఉండే ఈ టేబుల్‌ పైభాగాన్ని తయారుచేయడానికి టేకు, రోజ్‌ ఉడ్‌లను వాడారు. చుట్టూ కుర్చీలకు అరుదైన లెదర్‌ని ఉపయోగించారు.