సమన్వయంతో వ్యవస్థలు పని చేయాలి :మోదీ

న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకే కుటుంబమని గుర్తించి ఈ మూడు వ్యవస్థలూ పరస్పరం  బలోపేతం చేసుకునేలా పనిచేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమైన ఈ మూడు వ్యవస్థల మధ్య సమన్వయమే రాజ్యాంగానికి ఆయువుపట్టని చెప్పారు. ఏ ఆధికారానికైనా ఓ హద్దు ఉంటుందంటూ రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ చెప్పిన మాటలను మోదీ గుర్తుచేశారు. పాలనలో న్యాయ వ్యవస్థ పాత్రపై న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ దీపక్‌ మిశ్రా మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మారిన కాలానికి అనుగుణంగా ఎలా ముందుకెళ్లాలనేదానిపై మూడు వ్యవస్థలూ కలసి ఆలోచిం చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మూడు వ్యవస్థలూ పరస్పరం విమర్శించుకోవాల్సిన అవసరం లేదనీ, ప్రతి వ్యవస్థలోని లోపాలూ మిగతా రెండు వ్యవస్థల్లోని వారికీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ న్యాయదినోత్సవం సందర్భంగా రెండు రోజులపాటు సుప్రీంకోర్టు, నీతి ఆయోగ్‌ నిర్వహించిన కార్యక్రమంలో మోదీ ముగింపు ప్రసంగం చేశారు. పౌరులు హక్కుల కోసం పోరాడటంతోపాటు బాధ్యతలను విస్మరించరాదని హితవు పలికారు. అంతకుముందు కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్‌ న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అధికారాల విభజనపై మాట్లాడుతూ ‘అధికార విభజన సిద్ధాంతానికి కార్యనిర్వాహక వ్యవస్థ కట్టుబడి ఉన్నట్టే న్యాయవ్యవస్థ కూడా కట్టుబడి ఉండాలని వ్యాఖ్యానించారు.