మెట్రోరైల్ ప్రారంభించిన మోదీ

హైదరాబాద్ మెట్రోరైల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మధ్యాహ్నం ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో మియాపూర్ చేరుకున్న ప్రధాని ముందుగా మెట్రో పైలాన్ ఆవిష్కరించి అనంతరం మెట్రోరైలును ప్రారంభించారు. మెట్రో స్టేషన్ మొదటి అంతస్తులో ప్రాజెక్టు, నగర పునఃనిర్మాణంపై దృశ్య, శ్రవణ ప్రదర్శనను మోదీ తిలకించారు. టీ-సవారీ యాప్, బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మెట్రో రైలు ఎక్కి కూకట్పల్లి వరకు, అక్కడినుంచి తిరిగి మియాపూర్ వరకు ప్రయాణించారు. ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, నాయిని, పద్మారావు, భాజపా నేతలు డా.లక్ష్మణ్, కిషన్‌రెడ్డి తదితరులు కూడా మెట్రోలో ప్రయాణించారు. కాగా మెట్రోరైలు బుధవారం ఉదయం 6 గంటల నుంచి నగర ప్రజలకు అందుబాటులోకి రానుంది. రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సర్వీసులు నడుపుతారు. మొత్తం 18 రైళ్లు నడుపుతారు. ప్రతి 15 నిమిషాలకు ఓ రైలు ఉంటుంది.