రాణించాలంటే మహిళలు మరింత కష్టపడాలి - ఇవాంకా


పురుషాధిక్య సమాజంలో రాణించాలంటే మహిళలు మరింత కష్టపడాలని తాను అనుభవపూర్వకంగా తెలుసుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంక ట్రంప్‌ అన్నారు. గత పదేళ్లలో మహిళా పారిశ్రామిక వేత్తల సంఖ్య 10శాతం పెరిగిందని, ఇప్పుడు అమెరికాలో కోటీ 10లక్షలమంది మహిళా పారిశ్రామిక వేత్తలు ఉన్నారని ఆమె చెప్పారు. స్వావలంబన, సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తున్న మహిళా వ్యాపారవేత్తలు మనకు మార్గదర్శకులన్నారు. ఒక్క మహిళ విజయ వంతంగా నిలబడితే ఆ కుటుంబం, సమాజం, వ్యవస్థలు నిలబడతాయని ఇవాంకా హర్షధ్వానాల మధ్య చెప్పారు. . ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో అట్టహాసంగా ప్రారంభమైంది. సదస్సు ప్రారంభ సభలో ఇవాంక ట్రంప్‌ మాట్లాడుతూ 150 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. జీఈ సదస్సులో 52శాతం మహిళలు పాల్గొనడం గర్వకారణం అన్నారు. ఎంతో మంది మహిళలు ఉత్పాదక రంగంలోకి వస్తున్నారని, గత దశాబ్దంలో మహిళా పారిశ్రామికవేత్తలు 90లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని ఉటంకించారు. వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటని ఆమె అన్నారు. భారత అంతరిక్ష విజ్ఞానం చంద్రుడిని దాటి మార్స్‌ దాకా వెళ్లిందని, ఇన్నోవేషన్‌ హబ్‌గా హైదరాబాద్‌ ఎదుగుతోందని తెలిపారు. హైదరాబాద్ లో యువత గొప్ప సంపద అని ఇవాంకా అన్నారు. ఆసియాలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా టి-హబ్‌ తయారైందని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఇవాంకా ప్రశంసలు జల్లు కురిపించారు. మోదీ ఆధ్వర్యంలో భారత్‌ పారిశ్రామి కంగా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సాధారణ స్థాయినుంచి ప్రధాని వరకూ మోదీ ప్రస్థానం భారతీయ నిపుణులకు స్ఫూర్తిదాయకమన్నారు. సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్‌ నరసింహన్‌, కేంద్రమంత్రులు నిర్మలాసీతారామన్‌, సుష్మాస్వరాజ్‌, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌, హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఈడీ నారా బ్రాహ్మణి, ఆపోలో ఫౌండేషన్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఉపాసన, సినీనటి మంచు లక్ష్మి, జీఎంఆర్‌ అధినేత గ్రంథి మల్లికార్జునరావు, వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.

ముఖ్యాంశాలు