హైదరాబాద్ చేరుకున్న ఇవాంక.. ట్రైడెంట్ హోటల్లో బస

హైదరాబాద్ లో ఇవాంక పర్యటన మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంక ట్రంప్‌ మంగళవారం తెల్లవారు జామున శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులు, భారత్‌లోని అమెరికా రాయబారి కెన్‌జుస్టర్‌, అమెరికాలో భారతీయ రాయబారి నవతేజ్‌సింగ్‌ సరన్‌, హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్స్‌లేట్‌ జనరల్‌ కాథరినా హడ్డా, తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు జయేష్‌ రంజన్‌, అంజనీకుమార్‌, సిఐడి ఐజి షికా గోయల్‌ తదితరులు ఆమెను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులతో కాసేపు ముచ్చటించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆమె తన వాహనంలో మాదాపూర్‌లోని ట్రైడెంట్‌ హోటల్‌కు సరిగా తెల్లవారుజామున నాలుగు నలభై   గంటలకు చేరుకున్నారు. ఆమె ట్రైడెంట్ హోటల్ నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు హెచ్ఐసీసీకి వస్తారు. హెచ్ఐసీసీలోని రెండో అంతస్తులో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో సమావేశం అవుతారు. విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లను సీఐడీ ఐజీ షికా గోయెల్‌ పర్యవేక్షించారు.