హైదరాబాద్ లో మెట్రో సర్వీసులు ప్రారంభం


భాగ్య నగర రవాణా రంగంలో నూతనాధ్యాయం మొదలైంది. బుధవారం ఉదయం నుంచి హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రయాణాన్ని ప్రారంభించింది. ఉదయం ఆరు గంటలకు ఒక రైలు నాగోలు స్టేషన్‌లో, మరో రైలు మియాపూర్‌ స్టేషన్‌లో బయల్దేరాయి. మొదటి రోజు సుమారు లక్షమంది ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రతి పావుగంటకో రైలు చొప్పున మొత్తం 18 రైళ్లు తిరుగుతాయి. మెట్రో కార్డుల విక్రయం కూడా మొదలైంది. మూడు రోజుల్లోనే 12 వేలకుపైగా కార్డులు అమ్మడయ్యాయి. రద్దీకి అనుగుణంగా మొదటి రోజే రైళ్ల సంఖ్యను పెంచాల్సి రావచ్చని ఎల్‌అండ్‌టీ భావిస్తోంది. మియాపూర్‌-నాగోలు 27.6 కిలోమీటర్ల మార్గంలో మొత్తం 24 మెట్రో స్టేషన్లున్నాయి. వీటి మధ్య ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటే ప్రస్తుతం గంటా 50 నిమిషాలు పడుతోంది. అదే మెట్రోలోనైతే 64 నిమిషాల్లోనే ఆ చివరి నుంచి ఈ చివరికి చేరుకోవచ్చు. మెట్రో ప్రయాణానికి విక్రయిస్తున్న స్మార్ట్ కార్డుల కోసం రూ.200 చెల్లించాలి. ఇందులో రూ.100తో రీఛార్జి చేస్తారు. కార్డుకు రూ.100 తీసుకుంటారు. ఈ కార్డును మెట్రోస్టేషన్‌ కౌంటర్‌లో తిరిగి ఇచ్చేస్తే, రూ.80 వెనక్కు ఇస్తారు.