ఇలాగే పని చేస్తా.. నష్టపోయినా సిద్ధమే


దేశ ప్రగతి కోసం కొత్త విధానాలు తీసుకొస్తూనే ఉంటానని, వాటికి ‘రాజకీయ మూల్యం’ చెల్లించడానికి కూడా తాను సిద్ధమేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేసారు. దిల్లీలో హిందుస్థాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన మోదీ తనపై ప్రతిపక్షాల విమర్శలకు స్పందించారు. తమ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని, అవినీతి, నల్లధన రహిత సమాజాన్ని తయారుచేయడమే లక్ష్యమని చెప్పారు. జీఎస్‌టీ, ఆధార్‌ అంశాలను ప్రధాని ప్రస్తావించారు. బినామీ ఆస్తులను బయటకు తీసుకొచ్చేందుకు ఆధార్‌ ఓ ఆయుధంలా పనిచేస్తోందన్నారు. అవినీతి నిర్మూలన, పారదర్శక వ్యవస్థకు జీఎస్‌టీతో ముందడుగు పడిందన్నారు. పెద్దనోట్ల రద్దుతో నల్లధనం అంతరించిపోయే స్థితికి చేరిందని మోదీ అన్నారు.