పోటాపోటీ క్షిపణి ప్రయోగాలు


ఉత్తరకొరియా బుధవారం ప్రయోగించిన ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి (ఐసీబీఎం)కి పోటీగా ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే దక్షిణ కొరియా కూడా క్షిపణి ప్రయోగం చేపట్టింది. ఉత్తర కొరియాకు సరైన సమాధానం చెప్పడానికే ఈ క్షిపణిని ప్రయోగించినట్లు దక్షణ కొరియా రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ మీదుగా ఈ క్షిపణిని ప్రయోగించినట్లు ఆ దేశం పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉత్తర కొరియాను ఉగ్రదేశంగా ప్రకటించిన నేపథ్యంలో ఆగ్రహించిన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ యున్‌ ఈ బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించారు. ఈ దేశపు వైఖరి మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేసాయి. కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఈ తాజా క్షిపణి పరీక్షకు సంబంధించి జపాన్‌ ప్రధాని షింజో అబే, దక్షణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జేఇన్‌లతో అత్యవసరంగా ఫోన్ చర్చలు జరిపారు. ఇదిలా ఉంటే జపాన్‌ అభ్యర్థనపై ఐరాస భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ) అత్యవసర సమావేశం ఏర్పాటుకి అంగీకరించింది.