బిజెపికి బాబు కటీఫ్ చెబుతారా?


బిజెపితో మిత్రత్వానికి మరోసారి స్వస్తి చెప్పాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారా? ఆయన మాటలు ఇంతే అలాగే అనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలు డిసెంబరు2వ తేదీకి వాయిదాపడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపు మీడియాతో ముచ్చటించారు. పోలవరం విషయంలో కేంద్రం వైఖరి పై ఆయన ఈ సందర్భంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. విభజన హామీల సాధనలో రాజకీయం చేయబోనని, తనకు కావల్సింది హామీల అమలేనని చెప్పారు. చివరి నిమిషం వరకు పోరాడే ఆశావాదిగా తనను తాను అభివర్ణించుకున్నారు. అయితే ప్రజలకు మేలు చేసే విషయంలో రాజీపడటానికి మాత్రం సిద్ధంగా లేనన్నారు. పోలవరం స్పిల్‌వే టెండర్లను కేంద్రం ఆపేయమంటే ఆపేస్తాం అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆ పని వాళ్లకే (కేంద్రానికి) అప్పగించి చేసుకోమంటాం. పోలవరానికి సాయం చేయబోమని కేంద్రం చెప్పేస్తే నమస్కారం పెట్టి తప్పుకుంటాం అని చెప్పారాయన. భాజపా నాయకులను ఈ విషయమై కేంద్రంతో మాట్లాడమని కోరానని ఆయన చెప్పారు. మిత్రపక్షం కాబట్టి సహనం, ఓర్పుతో వ్యవహరిస్తున్నా అన్నారు. అసలు పోలవరం విషయంలో సమస్య ఎక్కడుందో తనకు అర్థం కావట్లేదు అని చంద్రబాబు విస్మయం చెందారు. తమతో కలిసి వస్తామంటే పోలవరం విషయంలో ప్రతిపక్షాన్ని కూడా దిల్లీకి తీసుకెళ్తామన్నారు. దీనికోసం ప్రధాని అపాయింట్‌మెంట్‌ అడుగుతున్ననని చంద్రబాబు వివరించారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి, రాజధాని నగర నిర్మాణ పురోగతి అనేవి తెదేపా రాజకీయ అనివార్యతలు. కారణాలు ఏవైతేనేం.. అవి రెండూ అనుకున్న స్థాయికి చేరలేదు. అంచేత ఇప్పుడా పాపాన్ని కేంద్రప్రభుత్వం పై నెట్టేసి యుద్ధం ప్రకటిస్తే రాజకీయంగా లబ్ది చేకూరుతుందనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తున్నదని విశ్లేషకుల అభిప్రాయం.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం