ఆర్థిక వ్యవస్థ పరిమాణం పై ముకేశ్ సంచలన అంచనా

భారత ఆర్థిక వ్యవస్థ 500 బిలియన్ డాలర్ల నుంచి 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరడానికి 2024 కంటే ముందే సాధ్యం కావచ్చని ప్రఖ్యాత వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ అంచనా వేశారు. హెచ్‌టీ లీడర్షిప్ సమిట్‌లో ప్రసంగించిన అంబానీ ఇంకా ఏమన్నారంటే ..లోగడ తాను వేసిన అంచనా కంటే ముందుగానే మన ఆర్థిక వ్యవస్థ 2.5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరిందన్నారు. ఇప్పుడు మరో ఏడేళ్లలో మన ఆర్థిక వ్యవస్థ రెట్టింపై నుంచి 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది... 2030 నాటికి మన ఆర్థిక వ్యవస్థ 10 లక్షల కోట్ల డాలర్ల మైలురాయిని అధిగమిస్తుంది. ఈ శతాబ్దంలోనే అమెరికా, చైనాలను అధిగమించి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుంది. 21వ శతాబ్దం మధ్య కల్లా చైనాతో పోలిస్తే భారత ప్రగతే అధికంగా ఉంటుంది. తొలి పారిశ్రామిక విప్లవంలో బొగ్గు, ఆవిరి ద్వారా వచ్చే విద్యుత్‌శక్తిని యంత్ర శక్తిగా మార్చడానికి ఉపయోగించారు. రెండో విప్లవంలో విద్యుత్, చమురును భారీ ఉత్పత్తి, పంపిణీకి వాడుకున్నారు. మూడో విప్లవానికొచ్చేసరికి ఎలక్ట్రానిక్స్, ఐటీలతో ఉత్పాదకత, ఆటోమేషన్‌ను పెంచుకున్నారు. తొలి రెండు పారిశ్రామిక విప్లవాలను భారత్ సరిగ్గా వినియోగించుకోలేదనే చెప్పాలి. అయితే కంప్యూటర్ ఆధారిత మూడో విప్లవం వచ్చేసరికి గాడిలో పడింది. ఇక నాలుగో పారిశ్రామిక విప్లవంలో ఇపుడు మనం ఉన్నాం. ఇందులో అనుసంధానత, కంప్యూటింగ్, డేటా, కృత్రిమ మేధలకు ప్రాధాన్యం ఉంది. భారత్ కేవలం నాలుగో పారిశ్రామిక విప్లవంలో అగ్రగామి దేశంగా మారడానికి భారత్ కి అవకాశం ఉంది.చైనాకు తయారీ రంగం ఊతం ఇస్తే భారత్‌కు అద్భుత మేధ అలా కలిసొస్తుంది. మనం మేధో సేవలను మిగతా ప్రపంచానికి అందించగలిగితే అభివృద్ధి సుసాధ్యం. ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం భారత్‌కున్న అద్భుత మేధా శక్తికి ఒక ప్రబల ఉదాహరణ. విదేశీ మదుపర్లకు నా సూచన భారత ప్రగతిలో భాగంకండి. భారత్‌లో పెట్టుబడులు పెట్టండి. భారత్‌లో సంపాదించండి. అన్నారు ముకేశ్ అంబానీ.