కాంట్రాక్టర్ కోసం ప్రభుత్వాల సిగపట్లా.. హవ్వ!!


బిజెపి, తెదేపా నాయకులు పోలవరం విషయంలో వ్యవహరిస్తున్న తీరు చూస్తే వారంత తెలివైన మూర్ఖులు మరొకళ్ళు ఉండరు అనిపిస్తుంది!! పోలవరం కట్టండి అంటే చేతకాక.. చతికిలబడడం కాకుండా దానిని పక్కదోవ పట్టించడం కోసం పొత్తు, గాడిదగుడ్డు అంటూ ప్రచారం చేస్తారేమిటి? అసలు వారిద్దరూ కలిసి ఉంటే ఎవడికి, విడిపోతే ఎవరికీ? అది వారి అంతర్గత రాజకీయ లాభ నష్టాల వ్యవహారం.. దానితో పోలవరాన్ని ముడి పెట్టి రాష్ట్ర భవిష్యత్తుని అగమ్య గోచరం చేస్తున్నారు! అసలు పోలవరం విషయంలో ప్రజలు అడిగే సింపుల్ ప్రశ్నలకు కూడా ఒక్క దానికైనా వారు సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నారా? పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం కిరణ్ కుమార్ రెడ్డి హయాం లో 13 వేల కోట్లు ఉంటే గడచిన మూడున్నరేళ్లలో అది దాదాపు 56 వేల కోట్లకి పెరిగింది. అది ఎందుకు పెరిగింది అనే విషయాన్ని ఎంతమంది ప్రశ్నించినా ఏ ఒక్క నాడైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్లారిఫై చేశాయా? జాతీయ ప్రాజెక్ట్ గా పోలవరాన్ని ప్రకటించారు.... ఎంత ఖర్చయినా ఇచ్చేస్తామని బిజెపి ప్రభుత్వం ఒకటికి నాలుగు సార్లు చెప్పింది. అయితే అలా ప్రకటించిన పోలవరాన్ని మేము కట్టలేము... మీరు స్వయంగా కట్టండి అని కేంద్రం మన సీఎం గారిని అడిగిందా? అలా వారు ప్రాధేయపడితే చంద్రబాబు దయతో ఒప్పుకున్నారా? లేక నాకు ఈ ప్రాజెక్ట్ బాధ్యతలు అప్పజెప్పమని బాబు గారే కేంద్రాన్ని అడిగారా? ఇవి రెండూ కాకుండా ఈ కేంద్ర ప్రాజెక్ట్ కి నువ్వు మాస్టర్ కాంట్రాక్టర్ గా ఉండమని ఎవరైనా బిజెపి పెద్దాయన బాబుగారికి ఆబాధ్యత దొడ్డిదారిన అప్పగించారా? నాకు తెలిసి ఇది కేంద్రమే కట్టాల్సిన ప్రాజెక్ట్... అసలే కొత్త రాష్ట్రం... మౌలిక సదుపాయాలు , రాజధాని కూడా లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అయినా ఆ బరువు రాష్ట్రం తలకెత్తుకోవడం ఎందుకసలు? ఇక్కడ దినసరి పాలనే మనకి తెమలక పోలవరాన్ని కేంద్రం కట్టాలని కోరుకున్నాం. దానికి వాళ్ళు ఒకే అంటే అది కూడా నేనే మోసేస్తానని బాబుగారెందుకు కాంట్రాక్టర్ గా బయలుదేరటం? అసలు ఈ ప్రాజెక్ట్ నిండా రాజకీయ నాయకులే ఎందుకు కనిపిస్తున్నారు? కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు.. ఇలా ఎక్కడ చూసినా ఆ పార్టీ, ఈ పార్టీ అని లేకుండా రాజకీయ ప్రాబల్యమే ఎందుకు గోచరిస్తుంది. కాంట్రాక్టర్లకు దండిగా డబ్బులొచ్చే మట్టి పనులు పోటాపోటీగా చేసేసి అసలు పని వచ్చేసరికి ఎవడికి వాడు కాడె దింపేయడం ఏమిటసలు! అసలు ఒక కాంట్రాక్టర్ వ్యవహారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గొడవలేమిటి? సాక్షాత్తూ ముఖ్యమంత్రికి ఆగ్రహం ఏమిటి? దానికి ప్రతిగా బిజెపి చిందులేమిటి? నువ్వు కట్టాల్సిన ప్రాజెక్ట్.. నువ్వే కట్టు... నాకెందుకీ తలనొప్పి అని వదిలేసి చంద్రబాబు మిగతా పనులు చూసుకుంటే చాలు కదా...! ఆ లెక్కలు, పత్రాలు ఒకసారి చూసుకుని ఇవ్వాల్సింది ఏదో ఇచ్చి బిజెపి పోలవరం పని చేసేస్తే చాలు కదా! ఇది వదిలేసి... పోలవరం జోలికి వస్తే మీతో పొత్తు కూడా వదిలేస్తా అని పరోక్షంగా తెదేపా బెదిరిస్తున్నట్టు వ్యాఖ్యలు ఎందుకు కనిపిస్తున్నాయి? బాబ్బాబు నువ్వే కట్టాలి.. అంటూ బిజెపి వాళ్ళు ఓ పక్క చంద్రబాబుని బతిమాలుతూ మరోపక్క మోడీ భజన ఏమిటి? అసలు జాతీయ ప్రాజెక్ట్ గా పోలవరాన్ని ప్రకటించిన తర్వాత కేంద్రం ఏమి చేసింది? అసలు ఈ ప్రాజెక్ట్ పనులేమిటి.. ఎంతవరకు పూర్తి అయ్యాయి.. ఇంకా ఎంత జరగాలి .. ఇలాంటి సర్వే ఏదైనా చేసిందా? ఇంత ఖర్చు పెట్టారు.. ఈ ఈ పనులకు ఇంత ఖర్చవుతుంది అనే అంచనా ఏమైనా వేసుకుందా? ఏమీ చేయకుండానే ఎవరి మాటలు పట్టుకుని కేంద్రం తగుదునమ్మ అని ఇందులో తల దూర్చింది? తల మాత్రమే పట్టే కంతలో బుర్ర దుర్చేశాక లాక్కోవడం అంత ఈజీ కాదని బిజెపి రాజకీయ దురంధరులకి తెలియదా? ఇంతా అయ్యాకా ఇప్పటికి కూడా అసలు ప్రతిష్టంభన ఏమిటో బిజెపి ఎందుకు చెప్పలేకపోతున్నది? అసలు ఇక్కడ తేడా ఎందుకు, ఏ విషయంలో వచ్చింది? తప్పెవరిది? ఇది స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత రెండు జాతీయ పార్టీల పైన ఉన్నది!! పనులు ఆలస్యం అయితే కాంట్రాక్టర్ ని మార్చుకోవడం అనేది ఒక సాధారణ విషయం... ఈ విషయంలో ఏకంగా ప్రభుత్వాలు సిగపట్లు పడుతున్నాయి ఇక్కడ ! నాకు తెలిసి కేవలం కాంట్రాక్టర్ మార్పు గొడవ కాదు ఇక్కడ.. ఇంకా ఏదో ఉంది! పోలవరం విషయంలో ఆ పీట ముడి ఏమిటో తెలియాలి! సామాన్య జనాన్ని కదిలిస్తే రెండు విషయాలు చెబుతున్నారు.. ఇవి ప్రజల సునిశిత పరిశీలన శక్తికి నిదర్శనాలు.... వాటాల్లో తేడా వచ్చిందని... సమర్థంగా రాష్ట్ర పెద్దలకి, కేంద్ర పెద్దలకి పంపకాలు చేసే మధ్యవర్తిత్వం కొరవడడంతో ఈ పరిస్థితి వచ్చిందని బాహాటంగా చెబుతున్నారు. ఇంకొందరైతే... పోలవరం కట్టడం ఎలాగూ పూర్తవదు కాబట్టి ఈ పొత్తు గొడవని తెరపైకి తెచ్చి పబ్బం గడుపుకొంటున్నారని ఇది బిజెపి, తెదేపా ఇద్దరికీ తెలిసే జరుగుతున్నదని ఊహిస్తున్నారు. అసలు పోలవరానికి అనుబంధం అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న రెండు నీటి పథకాలను కేంద్రం తన పరిగణనలోకి తీసుకుందా లేదా? ఆ విషయం ముందు తేలాలి. కాఫర్ డ్యామ్ విషయంలో రాష్ట్రం పట్టు పట్టడం ఏమిటి.. కేంద్రం వద్దని అడ్డు పడ్డం ఏమిటి? రెండు ఎద్దులూ చెరో వైపు లాగితే బండి ఎలా నడుస్తుంది? ప్రాజెక్ట్ కి అసలు డిజైన్ అంటూ ఉండదా? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టుకుంటూ, ఆపుకుంటూ పోతారా? చివరిగా ఒక్కమాట.. రాష్ట్రమైనా, ప్రాజెక్ట్ అయినా ఒకడి అబ్బ సొత్తు కాదు. మీరు ఖర్చు పెట్టే ప్రతి పైసా, వృథా చేసే ప్రతి పైసా కూడా జనానిదే. అందుకే ప్రతి దానికీ ప్రజలకు తాము జవాబుదారీ అనే విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలు గుర్తుంచుకోవాలి.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం