పోల"వరం" ఇస్తే మాపై శాపాలా?


పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఒక అధికారి ఇచ్చిన లేఖకు సమాధానం ఇవ్వకుండా, కేంద్రంపై ఆరోపణలతో నెపం వేయడం మంచి సంప్రదాయం కాదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. నూటికి నూరుశాతం ఈ ప్రాజెక్ట్ పూర్తిచేయాలన్నదే బిజెపి ఉద్దేశ్యమని ఆయన స్పష్టం చేసారు. "పోలవరం స్పిల్‌వే పనుల టెండర్లు ఆపాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రాసిన లేఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం శాసనసభలో స్పందిస్తూ, పోలవరం పనులు వేగంగా జరుగుతున్న ఈ దశలో కేంద్రం నుంచి వచ్చిన లేఖ గందరగోళం సృష్టిస్తోందని అన్నారు. ఈ దశలో ప్రాజెక్టు ఆగిపోతే కట్టడం కష్టమని పేర్కొన్నారు. "ఈ ప్రాజెక్టు మేం చేపడతామని ఎప్పుడూ కోరలేదు. కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టు చేపడతానంటే నాకెలాంటి అభ్యంతరమూ లేదు. నాకు ఎలాంటి భేషజాలూ లేవు. ప్రజలందరూ కోరుకుంటే, రేపు ఉదయానికల్లా ఈ ప్రాజెక్టును వారికి అప్పగించేస్తా"అని కూడా సీఎం ప్రకటించారు. దీనిపై చర్చ నడుస్తున్న నేపధ్యంలో సోము వీర్రాజు శుక్రవారం ఉదయం కాకినాడలో విలేకరులతో మాట్లాడారు. జిల్లా బిజెపి అధ్యక్షులు వై. మాలకొండయ్య తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. "పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్ర మనుగడకు ఎంతో అవసరమని బిజెపి గుర్తించింది. 2014ఎన్నికలు అయిన వెంటనే ముంపు మండలాలను ఏపీలో కలపడానికి ఆర్డినెన్స్ తెచ్చిన ఘనత బీజేపీదే. ఇక ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే 60శాతం పనులు పూర్తయ్యాయని ముఖ్యమంత్రే చెబుతున్నారు. సోమవారం పోలవరం అంటూ సమీక్ష చేస్తున్నారు. దాదాపు 60వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కి సంబంధించి, సుమారు 14వందల కోట్ల రూపాయల స్పిల్ వే పనుల టెండర్ ప్రకటన 18రోజులు కాకుండా 45రోజులపాటు వెబ్ సైట్ లో పెట్టాలని కేంద్ర అధికారులు లేఖ రాసారు. కీలకమైన స్పిల్ వే విషయంలో సాంకేతిక అంశాలు లేవనెత్తితే, ఎంతోసమర్ధత కలిగిన సీఎం,ఈ అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించుకోవాలి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో కేవలం 14వందల కోట్ల రూపాయల పనులకు అభ్యంతరం వస్తే, పరిష్కరించుకోకుండా,ఇప్పటికే 60శాతం పూర్తయిందని చెబుతున్న ఈ ప్రాజెక్ట్ నుంచి వెనక్కి ఎలా వెళ్తారు' అని వీర్రాజు ప్రశ్నించారు. ’’పోలవరంపై ఎవరూ రాజకీయం చేయవద్దు. టెండర్ల విషయంలో అనవసర గందరగోళం సృష్టించొద్దు. ప్రాజెక్టు విషయంలో కమిట్‌ మెంట్‌తో పని చేస్తున్నది బీజేపీ మాత్రమే. ఇప్పటివరకూ కేంద్ర సహకారం లేకుండానే పోలవరం 60శాతం పూర్తయిందా?" అని కూడా సోము నిలదీశారు. చంద్రబాబు స్వయంగా చెప్పినట్లు ఆయనపై విశ్వాసంతోనే పోలవరం పర్యవేక్షణ అప్పగించినప్పుడు కేంద్రం ఈ ప్రాజెక్టుని ఎలా అడ్డుకుంటుంది? ఈ ప్రాజెక్ట్ వలన ఎవరికి లాభం, ఎవరికి నష్టం అని ఆలోచించకూడదు. జీవనాడి అయిన ఈ ప్రాజెక్ట్ విషయంలో రాజకీయం చేస్తే,ప్రజలు నష్టపోతారని గ్రహించాలి. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం. పోలవరాన్ని పూర్తిచేయడానికి బిజెపి చిత్తశుద్ధితో వుంది"అని వీర్రాజు స్పష్టం చేసారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం