పోలవరంలో అవినీతి.. బాబు జైలు ఖాయం


పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఎన్నో అవకతవకలు జరిగాయని.. విచారణ జరిపిస్తే సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలంతా జైలుకు వెళ్తారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో పోలవరంపై ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం కడితే 800 టీఎంసీల నీటిని వాడుకున్నా అడిగేవారు ఉండరని, ఆఖరి పాయింట్ కావడమే దీనికి కారణమని అన్నారు. శ్రీ రాంసాగర్ తరువాత గ్రావిటీ ద్వారా నీరు తీసుకునే వీలు పోలవరం దగ్గరే ఉందన్నారు. 2014లో పోలవరం జాతీయ ప్రాజెక్ట్ గా కేంద్రం ప్రకటించిందని, విభజన చట్టంలో పెట్టిన పోలవరంను రాష్ట్రం ఎందుకు కడతామని పట్టుబట్టిందని ఈ సందర్భంగా ఉండవల్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 2014నాటి రేట్లకే కేంద్రం నిధులు ఇస్తుందని ఆనాడే నీతి అయోగ్ చెబితే బాబు ఎందుకు అంగీకరించారని నిలదీశారు. కేంద్రం లేఖల్లో అమర్‌జిత్ సింగ్ ఏకంగా టెండర్లు నిలిపివేయమని సూచించారని, ఇ-ప్రొక్యూర్మెంట్ చేయాల్సిన రాష్ట్ర వెబ్ సైట్ లో ఆలస్యంగా వివరాలు పెట్టినందుకు ఆ లేఖలో అభ్యంతరాలు తెలిపారని ఉండవల్లి చెప్పారు. పేపర్ నోటిఫికేషన్ లో 1300 కోట్లని, వెబ్‌సైట్లో సుమారు 1400 కోట్లు పెట్టారని అంటూ... ప్రతిపక్షం చేసిన ఆరోపణలను ఇప్పుడు కేంద్రం కూడా ప్రశ్నిస్తున్నదని పేర్కొన్నారు. ట్రాన్స్ట్రాయ్ కంపెనీ పనూలు చేయకపోతే ఆ కంపెనీతో మాట్లాడి తప్పించాలన్నారు. లోటా పోలవరం పనులు చేయడం లేదని టిడిపి నేత నామా నాగేశ్వరరావు కంపెనీని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ పిలిచి, మాట్లాడి పనుల నుంచి తప్పించారని గుర్తు చేశారు. చంద్రబాబు ఇకనైనా పోలవరంపై ప్రజలతో నిజాలు చెప్పాలన్నారు. సాక్షాత్తు బీజేపీ అధికార ప్రతినిధే లెక్కలు బయటపడితే జైలుకు వెళ్తారని హెచ్చరించినా చంద్రబాబు కళ్ళు తెరవకపోవడం శోచనీయమన్నారు. పోలవరంపై చంద్రబాబు శ్వేత పత్రం ప్రకటించాలని ఉండవల్లి డిమాండ్‌ చేశారు. ఈ మూడేళ్ళలో రాష్ట్రం చేసిన అప్పులు 2.16లక్షల కోట్లని, వీటిని ఏమి చేసారో ప్రభుత్వం లెక్కలు చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు.

ముఖ్యాంశాలు