బీభత్సం సృష్టిస్తున్న ‘ఓఖి’

అరేబియా సముద్రంలో సంభవించిన పెను తుపాను ‘ఓఖి’ ఆదివారం నుంచి బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. లక్షద్వీప్ ప్రాంతంపై కేంద్రీకృతమై ఉన్న ఈ తుపాను వాయువ్య దిశగా గంటకు 15 కి.మీ వేగంతో కదులుతూ మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ వైపు దిశ మార్చుకుంటున్నదని తెలిపారు. ఓఖి తుపాను వల్ల కేరళలో ఇప్పటి వరకూ 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తిరువనంతపురం, కొల్లామ్, ఎర్నాకులమ్, త్రిసూర్, మలపురం జిల్లాల్లో 34 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి వేలాది నిరాశ్రయులను తరలించారు. లక్షద్వీప్‌లో తుపాను బీభత్సంలో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. కేరళలో 117 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కోస్ట్ గార్డు అధికారులు తెలిపారు. కేరళ వ్యాప్తంగా 531 మంది మత్స్యకారులను ఇప్పటి వరకూ రక్షించినట్టు ప్రభుత్వం తెలిపింది. భారత నేవీ, వైమానిక, కోస్ట్ గార్డు సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ తుపాను బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేరళ సీఎం పినరయి విజయన్ కేంద్రాన్ని కోరారు. ఓఖి తుపాను ప్రభావంతో తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి, విరుద్‌నగర్, తూత్తుకుడి జిల్లాలు అతాలాకుతలం అయ్యాయి. ఈ ప్రాంతాల్లో వేల సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కన్యాకుమారి జిల్లాలో అపార నష్టం వాటిల్లింది.