అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన రాహుల్

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పట్టాభిషేకానికి రంగం సర్వ సన్నద్ధం అయింది. పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ సోమవారం నామినేషన్ వేశారు. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ వెంట మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ సీనియర్ నేతలు షీలా దీక్షిత్, అహ్మద్ పటేల్, జితిన్ ప్రసాద, సిద్ధరామయ్య, అశోక్ గెహ్లోత్, తరుణ్ గొగోయ్, సుశీల్ కుమార్ షిండే, జ్యోతిరాదిత్య సింధియా, మోహ్సినా కిడ్వాయ్ తదితరులు ఉన్నారు. ఆదివారం సాయంత్రం వరకూ ఎవరూ నామినేషన్లు వేయలేదని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఎం. రామచంద్రన్ తెలిపారు. రాహుల్ మినహా ఎవరూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడే అవకాశం లేదు. దీంతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయమే కానున్నది. ఈ సాయంత్రానికే రాహుల్ అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు ప్రచారం చేసే అవకాశం ఉంది.