ఆర్కేనగర్‌ ఉప ఎన్నికకు హీరో విశాల్‌ నామినేషన్‌


తమిళనాడులో మరో హీరో రాజకీయ రంగప్రవేశం చేసారు. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికకు సినీ హీరో విశాల్‌ సోమవారం స్వత్రంత అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. నామినేషన్‌కు ముందు విశాల్‌ నాటి నటులు శివాజీ గణేశన్‌, ఎంజీ రామచంద్రన్‌ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. తమిళ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశాల్‌ తెలుగువాడే. సినిమాలే గాక సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉంటారు. తమిళ రైతులు ఆందోళన చేపట్టినపుడు విశాల్‌ దిల్లీ వెళ్లి మద్దతిచ్చా రు. చెన్నై తుపానుకు నీట మునిగిన సమయంలోనూ ఆయన పలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నడిఘర్‌ సంఘం అధ్యక్షుడిగా ఉన్న విశాల్‌ ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుండడం ఆకస్మిక సంచలనం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక జరుగుతున్నది. డిసెంబర్‌ 21న ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. 24న ఫలితాలు వెల్లడవుతాయి. తాజా తమిళ రాజకీయ పరిణామాల నేపథ్యంలో అన్ని పార్టీలకు ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ మధ్యలో విశాల్ రంగంలోకి దిగారు. కాగా ఆర్కే నగర్ లో తెలుగు వారి ప్రాబల్యం దృష్ట్యా తెలుగు వాడైనా విశాల్ ఫలితం తనకు అనుకూలంగా ఉంటుందని ఆశ పెట్టుకున్నారు.