ఉగ్రవాద శిబిరాలు తొలగిస్తారా.. తొలగించమంటారా?

పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను ఆ దేశ ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించకుంటే తామే ఆ పని చేయాల్సి వస్తుందని అమెరికా తీవ్రంగా హెచ్చరించింది. సీఐఏ డైరెక్టర్ మైక్ పాంపెయో ఈ గట్టి హెచ్చరిక చేసారు. గమనార్హమైన విషయం ఏమిటంటే అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ ఇస్లామాబాద్ పర్యటనలో ఉండగానే మైక్ ఈ వ్యాఖ్యలు చేసారు. తాలిబాన్, హక్కానీ నెట్వర్క్, లష్కర్ తొయిబా, జైష్ ఏ మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు పాక్ స్వర్గధామంగా ఉన్న విషయం తెలుసు. తాలిబాన్ , హక్కానీ నెట్‌వర్క్‌ల ఉగ్రవాదులు పాక్‌లో ఉంటూ అఫ్గాన్‌లో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న విషయాన్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తోంది. పాక్‌పై అమెరికా ఇంత తీవ్ర హెచ్చరిక చేయడం అంతర్జాతీయంగా సంచలనం రేకెత్తించింది. అఫ్గానిస్థాన్‌లో తాలిబాన్ల పతనం తరువాత అమెరికా సహా వివిధ దేశాలు పునర్నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నాయి. కానీ పాక్ గిరిజన ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదులు అఫ్గాన్‌లో విధ్వంస చర్యలకు పాల్పడుతున్నారు. పాక్ ప్రభుత్వ అండదండలతోనే పలు ఉగ్రమూకలు కార్యకలాపాలను నిర్వహిస్తు న్నట్టు నిఘా సంస్థలు తేల్చి చెప్పడంతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇపుడు పాక్ పై మండిపడుతోంది. ఉగ్రవాదంపై పోరులో పాక్ అంటీ ముట్టనట్టు ఉండడాన్ని అమెరికా నిశితంగా పరిశీలిస్తోంది. పైగా ప్రపంచంలో అనేకచోట్ల విధ్వంసాలు చేస్తున్న అనేక ఉగ్రవాద సంస్థల శిక్షణకు పాక్ కేంద్రంగా మారడం, పుట్టిల్లు కావడంతో అమెరికా గొంతు పెంచింది. ప్రత్యేకించి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన అనంతరం ఉగ్రవాదం పై రాజీ లేని ధోరణి కనబరుస్తున్నారు. తాజాగా అఫ్గన్‌పై నూతన విధానాన్ని అమెరికా రూపొందించింది. దీనిపై పాక్‌తో చర్చించడానికే అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ ఇస్లామాబాద్‌కు వెళ్లారు.