ఉత్తర కొరియాని వణికిస్తున్న దెయ్యం వ్యాధి


వరుస అణు పరీక్షల విపరిణామాలు ఉత్తర కొరియాని వెంటాడుతున్నాయా? అక్కడి పరిస్థితులు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. అంతుచిక్కని వ్యాధితో ఇపుడు ఉత్తరకొరియా ప్రజలు బెంబేలెత్తిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అణు పరీక్షలతో విడుదలైన కాలుష్య పదార్థాలు ఆ దేశ ప్రజల ఆరోగ్యంపై పెను దుష్ప్రభావం చూపుతున్నాయి. గర్భస్థ శిశువులపైనా, స్త్రీ, పురుషుల ప్రత్యుత్పత్తి, నాడీ వ్యవస్థల మీద రేడియేషన్‌ ప్రభావం తీవ్రంగా ఉంటున్నట్లు అంతర్జాతీయ పరిశీలకులు చెబుతున్నారు. 2011లో దేశ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన కింగ్‌ జాంగ్‌ ఉన్‌ వరుస అణు పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరకొరియాలో ఉన్న అణు పరీక్షా కేంద్రాల్లో ఒకటైన ‘పంగ్యే రీ’ వద్ద రేడియేషన్‌ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. దీంతో పంగ్యే రీ వద్ద పహారా ఉంటున్న సైనికులు అంతుచిక్కని వ్యాధి బారిన పడి మరణిస్తున్నారు. తీవ్ర భయాందోళనలకు గురవుతున్న సైనికులు రేడియేషన్ బారి నుంచి తప్పించుకునేందుకు దక్షిణ కొరియాలోకి పారిపోతున్నారు. దాదాపు 30 మంది ఉత్తరకొరియా సైనికులు అనారోగ్య కారణాలతో దక్షిణ కొరియాలోకి పారిపోయి వచ్చారని భోగట్టా. రేడియేషన్‌ ​కారణంగా వీరు విపరీతమైన నొప్పితో బాధపడుతున్నారని ఈ సైనికులకు చికిత్స అందించిన దక్షిణ కొరియా వైద్యులు చెప్పారు. అణు పరీక్షల వల్ల ఇప్పటివరకూ ఉత్తరకొరియాలో వేలాదిమంది మరణించారని, అయితే ప్రభుత్వం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నదని దక్షిణ కొరియాలోకి పారిపోయి వచ్చిన ఓ సైనికుడు తెలిపారు. రేడియేషన్‌ కారణంగా పలువురికి సోకిన అంతు తెలియని వ్యాధిని ఉత్తర కొరియాలో ‘ఘోస్ట్‌ డిసీజ్‌ (దయ్యపు వ్యాధి)’ అని పిలుస్తున్నారట. రేడియేషన్‌ కారణంగానే ఉత్తరకొరియాలో అంతు చిక్కని మరణాలు సంభవిస్తున్నాయని చెప్పడానికి ఎలాంటి ప్రత్యేక ఆధారాలు లేకపోయినా, అది కాక మరో కారణం కూడా తోచడంలేదని దీనిని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.