పోలవరంపై పట్టు బిగించిన కేంద్రం


పోలవరంపై నితిన్ గడ్కరీ పూర్తిస్థాయిలో పట్టు బిగించారు. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రాజెక్ట్ సైట్ ని పరిశీలిస్తానని అయన స్పష్టం చేసారు. 2019 కల్లా ప్రాజెక్ట్ పూర్తి చేసి తీరాలని అయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులను ఆదేశించారు. ఏపీ మంత్రి దేవినేని ఉమ బృందం, కాంట్రాక్టర్లతో అయన సమావేశమై పోలవరంపై విస్తృతంగా చర్చించారు. గంటన్నర పాటు ఈ సమీక్ష జరిగింది. కొత్త టెండర్ల విషయం మీకు సంబంధం లేని విషయం అని కాంట్రాక్టర్లకు కేంద్ర మంత్రి స్పష్టం చేసారు. మీ ఒప్పందం ప్రకారం మీరు పనులు చేసుకు పొండని ఆయన వారికీ చెప్పారు. మాస్టర్ కంట్రాక్టర్ గనుక సబ్ కాట్రాక్టర్లకు డబ్బు ఇవ్వకపోతే ఆ డబ్బు ప్రభుత్వమే చెల్లిస్తుందని.. కాబట్టి ప్రతి కాంట్రాక్టర్ పనిని సకాలంలో దీక్షగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. తాను వ్యక్తిగ్గతా శ్రద్ధతో క్షేత్ర స్థాయి పనుల పురోగతి ని పరిశీలిస్తానని గడ్కరీ వారికి చెప్పారు. ట్రాన్స్ ట్రాయ్ పని చేయడం లేదన్న ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం ఆయన దృష్టికి తేగా ఆ విషయాన్నీ తర్వాత చూద్దామని, తిరిగి పనులను పరిశీలించాలని ఆయన చెప్పారు. ఈ సమావేశానికి ముందు దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రమంత్రి గడ్కరీకి ఫోన్ చేసి ప్రత్యేకంగా పోలవరంపై చర్చించారు. పోలవరం విషయంలో కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని, నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్ట్ ని పూర్తి చేద్దామని ఈ సందర్భంగా గడ్కరీ ఆయనకు హామీ ఇచ్చారు. ఈనెల 22న పోలవరం ప్రాజెక్ట్ సైట్ కి వస్తానని గడ్కరీ తెలిపారు. అప్పర్ కఫర్ డాం డిజైన్లపై నెలకొన్న సందిగ్ధత విషయంలో కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, అధికారుల జాయింట్ సమావేశం చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. కాగా పోలవరం కాంట్రాక్టర్ మార్పుపై పట్టు పట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమావేశంలో కూడా తలనొప్పి తప్పలేదు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ మార్పు పై మరోసారి కేంద్రమంత్రి భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ ను మారిస్తే పనులు ఆలస్యం అవుతాయని ఆయన అన్నారు. ట్రాన్స్ ట్రాయ్ కి పని పూర్తి చేసే సామర్థ్యం లేదని రాష్ట్ర ప్రతినిధులు ఆయనకి చెప్పారు. దీనికి గడ్కరీ స్పందిస్తూ 22న ప్రాజెక్ట్ సైట్ కి వచ్చి అన్ని కోణాల్లో పనుల పురోగతిని పరిశీలిస్తానని చెప్పారు. నిధుల విడుదల ఎప్పటికప్పుడు జరిగితే పనులు చేయడానికి ఇబ్బంది ఏమీ లేదని కేంద్ర మంత్రి ఎదుట సబ్ కాంట్రాక్టర్లు స్పష్టం చేసారు. భూ సేకరణ, పునరావాసం నిమిత్తంగా రాష్ట్రప్రభుత్వం రెండు వేల కోట్ల వరకు ఖర్చు చేసిందని, ఆ డబ్బు ఇప్పించాలని కోరారు. కేంద్ర సహకారం సంపూర్ణంగా ఉంటుందని హామీ ఇచ్చిన గడ్కరీ. పెండింగ్ బిల్స్ పై ఆర్థికమంత్రి తో చర్చించి మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. పెండింగులో ఉన్న డ్రాయింగ్స్ అన్నిటిపై వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని, అలసత్వం వహించరాదనీ అధికారులను ఆదేశించారు. త్వరగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆఫీస్ ను కూడా రాజమండ్రికి తరలించాలని చెప్పారు.

ముఖ్యాంశాలు