విశాల్ నామినేషన్ పై హై డ్రామా.. ఎట్టకేలకు ఆమోదం


తమిళనాడు ఆర్కేనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో నటుడు విశాల్‌ నామినేషన్‌ వ్యవహారంలో హై డ్రామా నెలకొని చివరికి పరిష్కారం అయింది. తొలుత విశాల్ నామినేషన్ ను తిరస్కరించిన అధికారులు ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని విశాల్‌ తన ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడిస్తూ.. ‘సుదీర్ఘ పోరాటం తర్వాత ఆర్కేనగర్‌ ఎన్నికలకు సంబంధించిన నా నామినేషన్‌కు ఆమోదముద్ర పడింది. సత్యం జయించింది’ అన్నారు. విశాల్‌ సమర్పించిన నామినేషన్‌ పత్రాలు అసంపూర్తిగా ఉన్నందుకే తిరస్కరించామని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం చివరి నిమిషంలో విశాల్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన గట్టి పోటీ ఇచ్చే అవకాశముందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో నామినేషన్‌ తిరస్కరణకు గురికావడం సంచలనం రేకెత్తించింది. తన నామినేషన్‌ తిరస్కృతిని వ్యతిరేకిస్తూ నటుడు విశాల్‌ ఆర్కేనగర్‌ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. దీని వెనుక కుట్ర ఉందని అయన ఆరోపించారు. పలు చర్చల అనంతరం ఎన్నికల అధికారులు నామినేషన్‌కు ఆమోదం తెలిపారు. అయితే ఏ కారణంగా నామినేషన్ తిరస్కరించారో.. తిరస్కరించిన నామినేషన్ ని ఏ ప్రాతిపదికన మళ్ళీ ఆమోదించారో ఎన్నికల సంఘం అధికారులు చెప్పలేదు.

ముఖ్యాంశాలు