ఆంధ్రా యూనివర్సిటీకి డిసెంబర్ 7న రాష్ట్రపతి రాక


రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెల 7న ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వస్తున్నారు. ఈ సందర్భంగా వర్సిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఏయూకు గతంలో కోవింద్ ఎంపీ హోదాలో వచ్చారు. 1978లో నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, 1984లో అప్పటి రాష్ట్రపతి జైల్‌సింగ్‌ ఏయూను సందర్శించారు. 2006లో రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్‌కలామ్‌ తూర్పునౌకాదళానికి వచ్చినా ఏయూకు రాలేదు. దీంతో ఎయు కి వస్తున్న మూడవ రాష్ట్రపతిగా కోవింద్ చరిత్ర పుటల్లోకి ఎక్కనున్నారు. ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు దిల్లీ వెళ్లినప్పుడు రాష్ట్రపతి కోవింద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏయూ 91 ఏళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ఆయనకు వివరించారు. ఆ సందర్భంలో కోవింద్‌ కూడా ఏయూతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. 2002-05 మధ్యలో తాను వర్సిటీకి వచ్చానని అప్పట్లో తాను ఎంపీగా ఉన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో వీసీ నాగేశ్వరరావు ఏయూకు రావాలని రాష్ట్రపతిని ఆహ్వానించారు. ఆ మేరకు రాష్ట్రపతి 7వ తేదీన ఇక్కడ పర్యటించనున్నారు. ఏయూలో ‘సెంటర్‌ ఫర్‌ డిఫెన్స్‌ స్టడీస్‌’ను రాష్ట్రపతి ప్రకటించనున్నారు. రక్షణదళాలకు సుప్రీం కమాండర్‌ అయిన భారత రాష్ట్రపతి రాక సందర్భంగా వర్సిటీలో ఒక ‘డిఫెన్స్‌ ఛైర్‌’ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఆ ‘డిఫెన్స్‌ ఛైర్‌’ విభాగ అధిపతిగా రక్షణదళాల నుంచి ఉద్యోగ విరమణ చేసిన అధికారిని నియమిస్తారు.

ముఖ్యాంశాలు