ఎపి లో డీఎస్సీ ద్వారా 12,370 టీచర్ పోస్టులు


ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ ద్వారా భారీగా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం షెడ్యూల్‌ ను ప్రకటించింది. ఈ ఉద్యోగాల భర్తీ ప్రకటనను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. డీఎస్సీ ద్వారా మొత్తం 12,370 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. 2018 జూన్‌ 12 నాటికి పోస్టింగ్‌లు ఇస్తామన్నారు. ఇందుకోసం డిసెంబర్‌ 26 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 2వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. మార్చి 23,24,26 తేదీల్లో డీఎస్సి పరీక్షలు జరుగుతాయన్నారు. మార్చి 9 వరకు హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీ, లాంగ్వేజ్‌ పండింట్‌ ఉద్యోగాలు 10,313తో పాటు తొలి దశలో మోడల్‌ పాఠశాలల్లో 1197 ఉద్యోగాలు, ప్రత్యేక అవసరాలు కల్గిన విద్యార్థుల కోసం మరో 860 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు గంటా వెల్లడించారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ డిసెంబర్‌ 15న వెలువడుతుంది. డిసెంబర్‌ 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు (ఆన్‌లైన్‌లో) దరఖాస్తులు స్వీకరిస్తారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు చివరి తేదీ: మార్చి 9, మార్చి 23,24,26 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించి ఏప్రిల్‌ 9న కీ విడుదల చేస్తారు. కీపై అభ్యంతరాలుంటే ఏప్రిల్‌ 10 నుంచి 16 వరకు స్వీకరిస్తారు. వాటిని పరిశీలించిన పిదప ఏప్రిల్‌ 30 న తుది కీ విడుదల అవుతుంది. మెరిట్‌ లిస్ట్‌ ను మే 5 న ప్రకటిస్తారు. ప్రొవిజనల్‌ సెలక్షన్‌ విడుదల చేసి మే 11న అభ్యర్థులకు సమాచారం ఇస్తారు. ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను మే 14 నుంచి 19 వరకు పరిశీలిస్తారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం