ఏపీకి రండి అంటూ కొరియా సంస్థలకు బాబు ఆహ్వానం


ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఎల్‌జీ సంస్థ ఆసక్తితో ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు గల అవకాశాలను ఎల్‌జీ ఛైర్మన్‌ సూన్‌ క్వోన్‌ కు వివరించానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దక్షిణ కొరియా నుంచి తెలిపారు. ఆ దేశంలో మూడోరోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు ఓసీఐ కంపెనీ సీఈఓ వు హ్యూమ్‌ లీతో సమావేశమయ్యారు. ఓసీఐ సంస్థ అమెరికాలోని టెక్సాస్‌, న్యూజెర్సీ, జార్జియా రాష్ట్రాలు, మలేషియాలో సౌరవిద్యుత్‌ ప్లాంట్లను నిర్వహిస్తోంది. వివిధ దేశాల్లో తమ సంస్థ కార్యకలాపాలపై సీఈఓ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. భారత్‌లో కార్యకలాపాలపై ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. సౌర విద్యుత్‌ రంగంలో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు వారిని కోరారు. తర్వాత ఎల్‌జీ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఎల్‌జీ ప్రెసిడెంట్‌ సూన్‌ క్వోన్‌ తమ సంస్థ కార్యకలాపాలను చంద్రబాబుకు వివరించారు. ఇప్పటివరకు తాము తయారీ రంగంలో కొరియా దాటి ఇతర దేశాలకు పూర్తిస్థాయిలో వెళ్లలేదని, చంద్రబాబు ప్రతిపాదనలు పరిశీలిస్తామని సూన్‌ తెలిపారు. కియా మోటార్స్‌ ఏపీలో స్థిరపడిన విధానం, ఫాక్స్‌కాన్‌ తమిళనాడును వదిలి ఏపీకి వచ్చి 13వేల మందికి ఉపాధి కల్పిస్తున్న వైనాన్ని ఎల్జీ ప్రెసిడెంట్‌కు వివచించారు. ఓసారి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి అక్కడున్న వ్యాపార అనుకూలతలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కోరగా సూన్‌ సానుకూలంగా స్పందించారు.

ముఖ్యాంశాలు