ట్రంప్ నిర్ణయంతో భగ్గుమంటున్న మధ్య ప్రాచ్యం


మధ్యప్రాచ్యంలో అశాంతికి మళ్ళీ తెర లేచింది. గత మూడు దశాబ్దాలుగా ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య శాంతి చర్చల్లో ప్రధాన పాత్ర పోషించిన అమెరికా ఇప్పుడు చిచ్చు రేపుతుండడం విశేషం. జెరూసలెంను ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ సిద్ధమవడంతో మళ్ళీ పాత కాష్ఠం రగులుకుంది. ట్రంప్ నిర్ణయంపై అరబ్‌ప్రపంచంలో నిరసన ప్రజ్వరిల్లుతున్నది. ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌అవీవ్‌ నుంచి అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు మార్చాలని ట్రంప్‌ తాజాగా నిర్ణయించారు. దీనిపై ఆయన ఇంకా అధికారిక ప్రకటన చేయకముందే ప్రపంచంలో సమీకరణాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. జెరూసలెం ఇస్లాం, క్రైస్తవం, యూదుమతాలకు పవిత్రస్థలం. 1948లో బ్రిటిషువారు వదిలి వెళ్లిన అనంతరం జెరూసలెంపై అరబ్బులకు, యూదులకు వివాదం తలెత్తింది. జెరూసలేం పశ్చిమప్రాంతాన్ని ఇజ్రాయెల్‌, తూర్పు ప్రాంతాన్ని అరబ్బులు స్వాధీనం చేసుకున్నారు. 1967 యుద్ధంలో తూర్పుప్రాంతాన్ని కూడా ఇజ్రాయెల్‌ స్వాధీనం చేసుకుంది. అయితే పాలస్తీనా ప్రజలు తూర్పు ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ వారికి ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో ఓటు హక్కులేదు. 3 వేల ఏళ్లుగా ఇది యూదుల రాజధాని అని ఇజ్రాయెల్‌ అంటుంటే భవిష్యత్తులో ఏర్పడే పాలస్తీనా దేశానికి అరబ్బులు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతం రాజధానిగా ఉండాలని పాలస్తీనా వాదన. నిజానికి 1995లోనే అమెరికా కాంగ్రెస్‌ జెరూసలెంను ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తించింది. వెంటనే అమెరికా రాయబార కార్యాలయాన్ని టెల్‌అవీవ్‌ నుంచి జెరూసలెంకు మార్చాలని సూచించింది. అయితే మాజీ అధ్యక్షులు బిల్‌క్లింటన్‌, జార్జి బుష్‌, ఒబామాలు ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తూవచ్చారు. ఇప్పుడు ట్రంప్‌ మాత్రం ఆ నిర్ణయం తీసుకోవడంతో అరబ్‌ ప్రపంచం భగ్గుమంది. సౌదీ అరేబియా, ఇరాన్‌ కూడా అమెరికా చర్యను ఖండించాయి. నిజానికి ఈ రెండు దేశాలకు పడదు. మరో వైపు ట్రంప్ నిర్ణయాన్ని యూరప్‌ దేశాలు కూడా వ్యతిరేకించాయి. అమెరికా ఏకపక్ష నిర్ణయంగా దీనిని అవి భావించాయి. మధ్యప్రాచ్యం మళ్ళీ భౌమనే పరిస్థితిపై పోప్‌ ఫ్రాన్సిస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. జెరూసలెం విషయంలో యథాతథ స్థితి పాటించాలని పిలుపునిచ్చారు.

ముఖ్యాంశాలు