మోదీ నా మొదటి కోరిక తీరుస్తారో లేదో...


లాభాల బాటలో ఉన్న డ్రెడ్జింగ్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డీసీఐ)ను ప్రైవేటీకరణ అనుచితమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. విశాఖలో 9 రోజులుగా దీక్ష చేస్తున్న డీసీఐ ఉద్యోగులను బుధవారం పవన్‌ పరామర్శించి మద్దతు ప్రకటించారు. ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేశ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, అతడి కుటుంబాన్ని పరామర్శించారు. పవన్‌ మాట్లాడుతూ ‘డీసీఐని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తామనడం సరికాదు. సంస్థ ఎదుగుదల వెనుక వెయ్యి మంది ఉద్యోగుల కష్టం ఉంది. ప్రజా సమస్యల నుంచి స్థానిక ఎంపీలు కంభంపాటి హరిబాబు, అవంతి శ్రీనివాస్‌ తప్పించుకుని తిరుగుతున్నా జనసేన వదిలిపెట్టదు. సమస్యల పట్ల చిత్తశుద్ధి లేనివారికి 2019లో ఓట్లు అడిగే హక్కు లేదు." అన్నారు. నేను ఏ రాజకీయ పార్టీ పక్షం కాదు. నేను ప్రజల పక్షం. డీజీఐ ఉద్యోగులకు నా నైతిక మద్దతు. .. అన్నారాయన. మోదీ, చంద్రబాబు తనకు బంధువులు కారని, ప్రజలే బంధువులని చెప్పారు. గత ఎన్నికల్లో నేను ప్రచారం చేస్తే గెలిచిన నేతలు ఇప్పుడు నేనెవరో తెలీదంటున్నారు...అని పవన్ ఎద్దేవా చేసారు. డీసీఐ ఉద్యోగులు ఈరోజు రోడ్డెక్కారంటే అది ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. వైకాపా అధినేత జగన్‌ డీసీఐ ఉద్యోగులకు మద్దతు ప్రకటించాలని పవన్ డిమాండ్ చేసారు. సమస్య గురించి చెబితే నేను ముఖ్యమంత్రి అయ్యాక పరిష్కరిస్తా అనడం తనకు నచ్చదన్నారు. పదవి లేకపోయినా ప్రజా సమస్యలపై పోరాడటమే తన ధ్యేయం అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే విశాఖ స్టీల్‌, ఎయిరిండియాను కూడా పైవేటు వ్యక్తులకు అప్పగించేస్తారని ఆందోళన వ్యక్తం చేసారు. జనసేన ప్రజల పార్టీ అని, ఈ పార్టీకి కులాలు, మతాలు ఉండవని చెప్పారు. ప్రజలకు నష్టం కలిగించే ఏ పార్టీకి మద్దతు ఇవ్వనని చెప్పారు. ప్రజా సమస్యల నుంచి తప్పించుకున్న ప్రతి ప్రజాప్రతినిధి 2019 లో సమాధానం చెప్పాలన్నారు. అభిమానులు ‘సీఎం.. సీఎం’ అరవడంపై పవన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఇతరులు చేసే తప్పునే మీరూ చేయకండి. అధికారానికి అనుభవం కావాలి. నాకు పదవి ముఖ్యం కాదు. ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యం’ అన్నారు. డీసీఐ ఉద్యోగుల సమస్యలపై ప్రధాని మోదీకి లేఖ రాశానని పవన్ చెప్పారు. సమస్యను పరిష్కరిస్తారా? లేదా? అన్నది వారికే వదిలేస్తున్నా... ఒకవేళ సమస్య పరిష్కరించకపోతే మాత్రం భాజపా ఓటమి విశాఖ నుంచే మొదలవుతుందని హెచ్చరించారు.. మోదీని నేను ఇప్పటివరకు ఏమీ అడగలేదు... ఈ తొలి డిమాండ్‌ను నెరవేరుస్తారో లేదో చూడాలని పవన్ వ్యాఖ్యానించారు.

ముఖ్యాంశాలు