విజయవాడలో మాజీ రౌడీ షీటర్ హత్య


విజయవాడ నగరం మాచవరం డౌన్‌ వద్ద ఒకప్పటి రౌడీ షీటర్‌ వేమూరి సుబ్రమణ్యం అలియాస్‌ సుబ్బు(35)ను కొందరు దారుణంగా హత్య చేశారు. పట్టపగలు జరిగిన ఈ ఘటనతో నగరం ఉలిక్కిపడింది. రెండు బైక్ లపై వచ్చిన ఆరుగురు సుబ్బును కత్తులతో నరికి హత్య చేసి పరారైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ యాతన అనంతరం పోలీసులు నగరంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. హతుడు గతంలో వంగవీటి శంతన్‌కుమార్‌పై కోర్టు దగ్గర జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు. తెనాలికి చెందిన శాఖమూరి సురేంద్ర వర్గంతో గొడవల కారణంగా సురేంద్ర హత్యకు సుబ్బు తుపాకీ కొనుగోలుకు ప్రయత్నించాడు. ఈ కేసులో విజయవాడ పోలీసులు అతడిని అరెస్టు చేసి హైదరాబాద్‌ పోలీసులకు అప్పగించారు. జైలు నుంచి బయటకు రావడంతో అతడిని ప్రత్యర్థులు హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా తెదేపా నేత కాట్రగడ్డ శ్రీను తన భర్తను చంపించాడని సుబ్బు భార్య దుర్గ ఆరోపించారు. శ్రీను చెప్పిన హత్యలు చేయకపోవడంతో సుబ్బును మాట్లాడాలని పిలిపించి హత్య చేయించాడని మృతుడి భార్య ఆరోపణ. విజయవాడ డిసిపి గజరాజ్‌ గోపాల్‌ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. సుబ్బుపై పలు కేసులున్నాయని ఆయన తెలిపారు. రాజకీయ హత్యా కాదా అన్నది విచారణలో తేలుతుందని అంటూ, ఈ హత్య వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదన్నారు.

ముఖ్యాంశాలు