స్థిరం లేని నిర్ణయాలు.. విశాల్ కి చుక్కెదురు

ఆర్కేనగర్ ఉప ఎన్నికల బరిలోకి దిగిన నటుడు విశాల్ నామినేషన్‌ను ఎన్నికల సంఘం అంతిమంగా తిరస్కరించింది. ఈ విషయంలో విశాల్ ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోలు, వాట్సాప్‌లు ఉన్న ఈ కాలంలో కేవలం ఓ లేఖ చూపించి నామినేషన్‌ను తిరస్కరిస్తున్నామనడం సరికాదన్నారు. కేవలం ఓ లేఖ ఇచ్చి నామినేషన్ రద్దు చేస్తున్నట్లు ఎలా చెబుతారు? ఏం జరిగిందో అందరికీ తెలియాలి. ఫోర్జరీ సంతకాలని ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదు చేసినప్పుడు వారు నా వద్దకు వచ్చి నన్ను అడగాలి తప్ప ఒకవైపు వాదననే పరిగణలోకి తీసుకుని నా నామినేషన్‌ను తిరస్కరించడం తప్పు.. దీనిని నేను కోర్టులో సవాల్ చేస్తాను.’ అని విశాల్ మీడియా సమావేశంలో మండిపడ్డారు. విశాల్‌తో పాటు జయలలిత మేనకోడలు దీప జయకుమార్‌ల నామినేషన్‌ను కూడా ఎన్నికల సంఘం తిరస్కరించింది. పలువురు స్వతంత్రుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నిరసన నేపథ్యంలో తొలుత విశాల్ నామినేషన్‌ను ఆమోదించిన ఎన్నికల సంఘం మళ్లీ రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది.