డ్రోన్ ల ద్వారా గ్యాస్ పైప్ లైన్ల పర్యవేక్షణ


ప్రధాన గ్యాస్‌ పైప్ లైన్ల భద్రత ను డ్రోన్ ల ద్వారా పర్యవీక్షించే కార్యక్రమాన్ని గెయిల్‌ ఇండియా ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ప్రస్తుతం పైపులైన్ల భద్రత పర్యవేక్షించేందుకు పురాతన విధానాన్ని అనుసరిస్తున్నామని గెయిల్‌ డైరెక్టర్‌ (పైపులైన్స్‌) అశుతోష్‌ కర్ణాటక్‌ వెల్లడించారు. డ్రోన్ లతో ఈ పని చేసే ప్రయోగాత్మక విధానం కింద మధ్య ప్రదేశ్‌లోని చంబల్‌ రవైన్స్‌లోని హెచ్‌బీజెడ్‌ పైపులైన్‌ను ఎంచుకున్నామన్నారు. దీనిని పరిశీలించేందుకు ఒక డ్రోన్‌ను అద్దెకు తీసుకున్నామని తెలిపారు. ఇది సత్ఫలితాన్నిస్తే, 15,000 కి.మీ పొడువున్న ప్రధాన పైపులైన్ల పర్యవేక్షణ నిమిత్తం మరిన్ని డ్రోన్లను వినియోగిస్తామన్నారు. డ్రోన్ల వినియోగానికి వివిధ సంస్థల నుంచి గెయిల్‌ అనుమతులు తీసుకుందన్నారు. ఇప్పటివరకు భారతీయ రైల్వే (ఇండియన్‌ రైల్వేస్‌), జాతీయ రహదారుల ప్రాథికారిక సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)లు మాత్రమే ఈ అనుమతులు పొందాయి. 2014 జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమలో పైప్ లైన్ నుంచి గ్యాస్ లీకై పలువురు మరణించిన, గాయపడిన నేపథ్యంలో భద్రతా ప్రమాణాలను పెంచేందుకు గెయిల్‌ తీసుకున్న పలు చర్యల్లో ఇది కూడా ఒకటి.