యుఎస్- ఉత్తర కొరియా మాటల యుద్ధం


దక్షిణ కొరియా, అమెరికా సంయుక్త విన్యాసాలు నిర్వహించడంపై ఉత్తర కొరియా తీవ్రంగా మండిపడింది. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని అయితే ఈ చర్యలతో యుద్ధం అనివార్యం అవుతుందని ఆ దేశం పేర్కొంది. ఉత్తర కొరియా ఈమధ్య శక్తిమంతమైన ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించడంతో ప్రతిగా అమెరికా భారీ సంఖ్యలో స్టెల్త్‌ యుద్దవిమానాలను దక్షిణ కొరియాకు పంపింది. తమ తమ చర్యలు, సన్నాహాలు ద్వారా యుద్ధానికి సన్నద్ధం అయిన ఇరు దేశాలూ మాటల యుద్ధంలో నిమగ్నమయ్యాయి. అంతర్జాతీయ సమాజం ఎంత చెబుతున్నా ఉత్తర కొరియా అణుపరీక్షలు, క్షిపణి ప్రయోగాలు మానడంలేదు. ప్రతిగా అమెరికా కూడా అదే స్థాయిలో రెచ్చిపోతుండడంతో కొరియా ద్వీపకల్పంలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. సెప్టెంబరులో అమెరికాకు చెందిన అధునాతన యుద్ధ విమానాలు బీ-1బీ బాంబర్లు పెద్ద సంఖ్యలో దక్షిణ కొరియాకు చేరుకున్నాయి. దీనిపై ఆగ్రహించిన ఉత్తర కొరియా తమ గగనతలంలో అమెరికా, దక్షిణ కొరియా యుద్ధవిమానాలు ప్రవేశిస్తే పేల్చివేస్తామని బెదిరించింది. అమెరికా ఇప్పటికే దక్షిణ కొరియాలోని తన స్థావరాల్లో సైన్యాన్ని, ఆయుధాలను సిద్ధం చేసింది. ఉత్తర కొరియా, అమెరికాలు రెండూ యుద్ధాన్ని స్వాగతించడం లేదు. అయితే యుద్ధం కోసం ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటున్నారు. యుద్ధం జరిగితే కారణం నువ్వంటే నువ్వని ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగంచేసి కవ్విస్తే... అందుకు ప్రతిగా అమెరికా యుద్ధవిమానాలను పంపించడం, బెదిరింపు ప్రకటన చేయడం జరుగుతున్న క్రమంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. కాగా కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంపై చైనా కలవరపడుతోంది. రెండు దేశాలు సంయమనం వహించాలని హితవు పలికింది. యుద్ధం వస్తే అందరికీ నష్టమే అని పేర్కొంది.