హోరాహోరీలో పైచేయి బీజేపీదే - సర్వేలు


గుజరాత్‌ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పరిస్థితులు ఆసక్తికరంగా మారుతున్నాయి. కుల, మత సమీకరణాలు, ఆసక్తి గొలిపే ప్రచార వ్యూహాలు వెరసి పరిస్థితులు కొత్త రూపును సంతరించుకున్నాయి. మొదట్లో బీజేపీకి ఏకపక్ష మొగ్గును సూచించిన సర్వేలలో ఇపుడు కాస్త భిన్నమైన వాతావరణం కనిపిస్తున్నది. గుజరాత్ లో మొత్తం సీట్లు 182 కాగా, మేజిక్‌ ఫిగర్‌ 92. తొలి రెండు ఒపీనియన్‌ సర్వేలకు భిన్నంగా తాజా సర్వేలో కాంగ్రెస్‌ ఒకింత పుంజుకుందని మలి విడత సర్వేలు సూచిస్తున్నాయి. అయితే అన్ని సర్వేలు, అప్పుడూ ఇప్పుడూ కూడా బీజేపీకే అధికారం దక్కుతుందని ఘంటాపధంగా చెబుతుండడం గమనార్హం. పవర్ దక్కుతుంది కానీ బిజెపికి సీట్ల సంఖ్య తగ్గుతుందని ఏబీపీ–సీఎస్‌డీఎస్, టైమ్స్‌నౌ తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఏబీపీ సర్వే ప్రకారం బీజేపీ 91–99 స్థానాల్లో, కాంగ్రెస్‌ 76–88 చోట్ల గెలిచే అవకాశాలున్నాయి. టైమ్స్‌ నౌ మాత్రం బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ఓట్ల తేడా 5 శాతం ఉంటుందని అంచనా వేసింది. బీజేపీ 111 స్థానాలను, కాంగ్రెస్‌ 68 స్థానాలను కైవసం చేసుకుంటాయని ఈ సర్వే పేర్కొంది. రెండు సర్వేలు కూడా బీజేపీ ఆశిస్తున్నట్టుగా 150+ సీట్లు తెచ్చుకోవడం అసాధ్యమని పేర్కొంటున్నాయి. ప్రాంతాల వారీగా బీజేపీ గెలిచే స్థానాల్లో పెద్దగా మార్పులేకపోయినా ఓట్ల శాతంలో స్వల్ప తగ్గుదల ఉందని టైమ్స్‌నౌ–వీఎంఆర్‌ సర్వే పేర్కొంది. మధ్య గుజరాత్‌లో బీజేపీకి 46 శాతం, కాంగ్రెస్‌కు 41 శాతం మంది అనుకూలంగా ఉన్నారని, కచ్, సౌరాష్ట్రల్లో బీజేపీ–44, కాంగ్రెస్‌–41, ఉత్తర గుజరాత్‌లో బీజేపీ–45, కాంగ్రెస్‌–42, దక్షిణ గుజరాత్‌లో బీజేపీ–46, కాంగ్రెస్‌–37 శాతం మంది మద్దతు పొందుతున్నారని సర్వేలో తెలిసింది. 2012తో పోలిస్తే అధికార పార్టీకి 3 శాతం ఓట్లు తగ్గుతాయని, అదే సమయంలో కాంగ్రెస్‌ 1శాతం ఓటు బ్యాంకును పెంచుకున్నదని తెలిపింది. 7 శాతం మంది ఎన్నికల్లో కుల ప్రభావం ఉంటుందని అభిప్రాయపడగా, 31 శాతం మంది పార్టీ ప్రభావంపై మొగ్గు చూపారని, 23 శాతం మంది ‘గుజరాత్‌ గౌరవాన్ని కాపాడటం’ కీలకాంశమని అభిప్రాయపడ్డారని సర్వే నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం