‘బాబర్ భక్తుడు... ఖిల్జీ ఆప్తుడు’


అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అడ్డు పడేలా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రహస్య ఒప్పందం చేసుకున్నారని బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ కన్వీనర్ జాఫర్‌యాబ్ జిలానీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీతో రాహుల్ రహస్యంగా మంతనాలు జరుపుతున్నారన్నారు. రాహుల్ గాంధీ ‘‘బాబ్రీ భక్తుడు, ఖిల్జీకి ఆప్తుడు’’ అంటూ నరసింహారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఒవైసీ, జిలానీలతో రాహుల్ జట్టు కట్టారు. రాహుల్ కచ్చితంగా ‘‘బాబర్ భక్తుడు’’.. ‘‘ఖిల్జీకి ఆప్తుడు’’. బాబర్ రామ మందిరాన్ని కూల్చివేస్తే... ఖిల్జీ సోమనాథ్ ఆలయాన్ని దోచుకున్నాడు. దురాక్రమణదారులైన ఈ ఇద్దర్నీ నెహ్రూ వంశం వెనకేసుకొస్తోంది. ఈ వంశానిది ఎప్పుడూ నయవంచనే..’’ అంటూ నరసింహారావు ఆరోపించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత మాత్రమే రామజన్మభూమి వివాదంపై విచారణ చేపట్టాలంటూ సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున బాబ్రీ మసీదు కేసును వాదిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత, సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ సుప్రీం ధర్మాసనాన్ని కోరిన సంగతి తెలిసిందే.

ముఖ్యాంశాలు