ఆధార్ అనుసంధానంపై ఇదీ స్పష్టత


పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్‌ సంఖ్యను అనుసంధానం చేసే గడువును మార్చి 31 వరకు పొడిగించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇంతవరకు ఆధార్‌ కార్డు లేనివారికి మాత్రమే ఈ గడువు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర, జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనానికి అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ ఈ విషయాన్ని తెలిపారు. నిజానికి డిసెంబరు 31 తో ఆధార్ అనుసంధానానికి అడువు ముగుస్తుంది. ఇంతవరకు కార్డులు లేనివారి కోసం మార్చి 31 వరకు గడువు పెంచడానికి కేంద్రం సుముఖంగా ఉందని, దీనిపై తక్షణం ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు. ఫిబ్రవరి ఆరో తేదీలోగా మొబైల్‌ నెంబర్లకు ఆధార్‌ను అనుసంధానించాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందున, ఆ గడువులో మాత్రం మార్పు ఉండదని చెప్పారు. ఆధార్‌ ఉన్నవారు వాటిని బ్యాంకు ఖాతాలు, సిమ్‌కార్డులతో గడువులోగా అనుసంధానం చేయాలని కోరారు. ఆధార్‌ అనుసంధాన్ని వ్యతిరేకిస్తూ వ్యాజ్యాలు దాఖలు చేసిన కక్షిదారుల తరఫున సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ వాదించారు. ఆధార్‌ అనుసంధానం చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోబోమని కేంద్రం చెప్పాలన్నారు. అటార్నీ జనరల్‌ స్పందిస్తూ ఆధార్‌ కార్డు లేనివారు దాని కోసం దరఖాస్తు చేస్తే వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోబోమని చెప్పారు. మార్చి 31 వరకు సంక్షేమ పథకాల ప్రయోజనాలను కూడా ఆపబోమని తెలిపారు. ఆధార్‌ అమలుపై మధ్యంతర స్టే ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను విచారించడానికి సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనుంది. వచ్చే వారం విచారణ జరిగే అవకాశం ఉంది. బ్యాంకు ఖాతాలు, పాన్‌ కార్డులను డిసెంబరు 31లోగా ఆధార్‌తో అనుసంధానం చేయాలని విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) గురువారం తెలిపింది. సిమ్‌ కార్డులకు గడువు ఫిబ్రవరి ఆరో తేదీ వరకు ఉందని స్పష్టం చేసింది. బ్యాంకు ఖాతాలు ఉన్నవారు వాటిని డిసెంబరు 31లోగా ఆధార్‌తో అనుసంధానించాలి. లేకుంటే అవి పనిచేయవని రెవెన్యూ విభాగం తెలిపింది. తపాలా కార్యాలయాల్లోని పొదుపు ఖాతాలు, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్లు, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, కిసాన్‌ వికాస్‌ పత్రాలకు ఆధార్‌ నెంబరు తప్పనిసరి. బీమా పాలసీనలకు ఆధార్‌, పాన్‌ నెంబర్లను అనుసంధానం చేయాలి. ఇందుకోసం జీవిత బీమా సంస్థ వినియోగదార్ల కోసం ఆన్‌లైన్‌లోనూ, కార్యాలయాల్లోనూ ఏర్పాట్లు చేసింది. అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) ప్రకారం కొత్తగా మ్యూచ్‌వల్‌ ఫండ్లు తీసుకున్నవారుగానీ, మ్యూచువల్‌ ఫండ్ల వ్యాపారంలో ఉన్నవారుగానీ ఆధార్‌ నెంబరును సమర్పించాలి. అలాగే పాన్‌ కార్డుకు ఆధార్‌ను అనుసంధానం తప్పనిసరి అని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది.

ముఖ్యాంశాలు