నాపై ఆ వ్యాఖ్యలు గుజరాత్ కే అవమానం - మోదీ


తనను నీచమైన వ్యక్తిగా నిందిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన చెందారు. అయ్యర్‌ వ్యాఖ్యలు గుజరాత్‌కు అవమానం అన్నారు. కాంగ్రెస్‌ నేతల్లోని మొఘలాయీ మనస్తత్వానికి ఈ పదజాలం సంకేతమన్నారు. సూరత్‌లో భాజపా ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ అయ్యర్‌ తనను నీచ కులంలో పుట్టినవాడిగా వ్యాఖ్యానించారని, ఇది గుజరాత్‌కు అవమానమని వాపోయారు. భారత వారసత్వానికీ ఇది అవమానకరమన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా గుజరాత్ ప్రజలు చూశారు. ఇప్పుడు ప్రధానిగా చూస్తున్నారు. అవమానంతో మీరు తలదించుకునే పని నేను ఏనాడైనా చేశానా?’ అంటూ ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రశ్నించారు. ఎవరైనా మంచి దుస్తులు వేసుకున్నా కాంగ్రెస్ వారు సహించలేరని విమర్శించారు. రాహుల్‌ గాంధీ పదే పదే మోదీ సర్కార్ ని ‘సూట్‌-బూట్‌ సర్కార్‌’ అని వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో ప్రధాని ఈ విమర్శ చేసారు. ప్రతిపక్ష నేతలు తనను గతంలో గాడిదతో పోల్చారని, ఇంకా అసభ్య పదజాలమూ ప్రయోగించారని, అయితే వాటిని వారి సంస్కారానికే వదిలేస్తున్నానని తెలిపారు. తాను తక్కువ కులంలో పుట్టినా మంచి పనులే చేశానన్నారు. తానెప్పుడూ పేదల కోసమే పనిచేశానని సూచించారు. అయ్యర్‌ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యపై కనీసం ట్విటర్‌లో కూడా స్పందించవద్దని భాజపా కార్యకర్తలు, మద్దతుదారులకు మోదీ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో భాజపాను గెలిపించడం ద్వారా కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్నారు. మోదీపై అయ్యర్‌ వ్యాఖ్యలను కేంద్రమంత్రులు అరుణ్‌ జైట్లీ, రవిశంకర్‌ ప్రసాద్‌, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా తీవ్రంగా తప్పుపట్టారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం