"బాబు" కుటుంబ ఆస్తులు రూ.69.60 కోట్లు


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో సహా కుటుంబసభ్యుల మొత్తం ఆస్తుల వివరాలను ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. పేపర్ విలువ కాకుండా మార్కెట్‌ విలువ ప్రకారమే ఈ ఆస్తులను చూపించామని అయన పేర్కొన్నారు. ఆస్తుల ప్రకటన చేయడం ఇది వరుసగా ఏడోసారని చెబుతూ దేశంలో మరే రాజకీయ కుటుంబం కూడా ఇలా ఆస్తుల జాబితాని ప్రకటించడంలేదన్నారు. తమ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నవాళ్లు ఏనాడైనా వారి ఆస్తులు ప్రకటించారా? అని సూటిగా ప్రశ్నించారు. పద్ధతి ప్రకారం వ్యాపారం చేయడం, ఆర్జించడం తప్పుకాదన్నారు. వారసులుగా అవకాశం వచ్చిన మాట నిజమని, అయితే సమర్థంగా పనిచేయకుంటే రాజకీయాల్లో నిలబడడం సాధ్యం కాదని అన్నారు. ఇకపోతే వైకాపా అధినేత జగన్‌ సొంతంగా ఎప్పుడూ ఆస్తులు ప్రకటించలేదని .. ఆయన ఆస్తులను సీబీఐ, ఈడీ ప్రకటిస్తున్నాయని ఎద్దేవా చేసారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెరిటేజ్‌పై 17 కేసులు వేశారని, కానీ ఒక్కదానినీ నిరూపించలేకపోయారని లోకేశ్‌ అన్నారు. చంద్రబాబు నికర ఆస్తుల విలువగా గా రూ.2.53 కోట్లను, భువనేశ్వరి పేరున రూ.25.41 కోట్లను, లోకేశ్‌ పేరున రూ.15.21 కోట్లను, బ్రాహ్మణి నికర ఆస్తులుగా రూ.15.01 కోట్లను, దేవాన్ష్‌ నికర ఆస్తులుగా రూ.11.54కోట్లను వెరసి సుమారు 70 కోట్ల విలువైన ఆస్తులను లోకేష్ ప్రకటించారు.

ముఖ్యాంశాలు