గుండు గీయిస్తే నేను ఊరుకుంటానా?


నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం కృష్ణా-గుంటూరు జిల్లాల కార్యకర్తలతో మేరిస్‌ స్టెల్లా ఆడిటోరియంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకసారి టీడీపీ నాయకుడు పరిటాల రవి తనకు గుండు గీయించారని జరుగుతున్నా ప్రచారంపై స్పందించారు. ‘తమ్ముడు’ సినిమా షూటింగ్‌ కోసం బీహెచ్ఇఎల్ లో ఉన్నప్పుడు అన్నయ్య నాగబాబు ఫోన్‌ చేసి పరిటాల రవి నీకు గుండు గీయించి కొట్టినట్లు తెదేపా కార్యాలయం నుంచి ఫోన్‌ చేసి చెప్పారని పవన్ అన్నారు. అసలు పరిటాల ఎవరో కూడా తనకు ఆ టైంలో తెలియదన్నారు. అయితే ఈ ప్రచారం పెరిగి పెరిగి పేపర్‌లో వార్తలు రాసే స్థాయికి పాతుకుపోయిందన్నారు. షూటింగ్‌లో చిరాకుగా ఉంది తానే గుండు గీయించుకున్నానని తనకు ఎవరూ గుండు కొట్టించలేదని పవన్ వివరణ ఇచ్చారు. అలా కు గుండు గీయిస్తే ఊరుకుంటానా? నేను ఊరుకునే వ్యక్తినా? అని అభిమానులను ప్రశ్నించారు. ఎన్ని రకాలుగా తనను అవమానించినా తాను తెదేపాకు మద్దతిచ్చానన్నారు. అభిమానులకు పవన్ జనసేన లక్ష్యాలను వివరించారు. విజయవాడలో కులాల మధ్య ఐక్యత లేదన్నారు. వంగవీటి రంగాను హత్యచేయడం తప్పు అన్నారు. సమాజం ముందుకెళ్లాలన్నా, అంబేడ్కర్‌ కలలు సాకారం కావాలన్నా కులాలకు అతీతంగా ప్రజలంతా మెలగాలని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రాష్ట్ర ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోనే తెదేపాకు మద్దతిచ్చానని, వైకాపా అధినేత జగన్‌పై అనేక అభియోగాలు ఉండడం వల్లనే ఆయనకు మద్దతు ఇవ్వలేదన్నారు.