బ్రిటన్ లో మాల్యా ఆస్తుల స్తంభన


బ్రిటన్‌ పారిపోయిన బ్యాంకు రుణాల ఎగవేతదారుడు విజయ్‌ మాల్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్రిటన్‌లోని అతడి ఆస్తులను స్తంభింపజేస్తున్నట్లు లండన్‌ న్యాయస్థానం స్పష్టం చేసింది. అతడి ఖర్చుల కోసం వారానికి 5వేల యూరోలు(సుమారు రూ.4లక్షలు) మాత్రమే ఇవ్వాలని న్యాయస్థానం పేర్కొంది. మాల్యాను భారత్‌కు అప్పగించడంపై లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ కోర్టులో 4 నుంచి 6వ తేదీ వరకు విచారణ జరిగింది. ఈ విచారణకి ఒక రోజు ముందే ఆస్తులను స్తంభింపజేస్తున్నట్లు న్యాయస్థానం అతడికి నోటీసులు పంపించింది. బ్రిటన్‌లో ఉన్న మాల్యా ఆస్తులను స్తంభింపజేయాల్సిందిగా భారత్‌ జనవరిలో లండన్‌ న్యాయస్థానాన్ని కోరింది. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి ఇప్పుడు నోటీసులు పంపించారు. కాగా ఖర్చుల కోసం ఇచ్చే నగదును 5వేల యూరోల నుంచి 20వేల యూరోలకు పెంచాల్సిందిగా మాల్యా న్యాయస్థానాన్ని కోరాడు. భారత్‌లోని బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్లకు పైగా రుణాలు ఎగవేసి గత రెండేళ్లుగా మాల్యా లండన్‌లో తలదాచుకుంటున్నాడు.

ముఖ్యాంశాలు