యారాడ ఘాట్ లో బస్సులు ఢీ


విశాఖలో యారాడ కొండపై విద్యార్థులను విహార యాత్రకు తీసుకెళ్లిన మూడు బస్సులు ఢీకొనడంతో 120 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈఘటనలో ఎవరికీ ప్రాణాపాయం వాటిల్లకపోవడం కొంతలో కొంత ఉపశమనం. అనకాపల్లి ఉడ్‌పేటకు చెందిన సిటీ పబ్లిక్‌ స్కూల్‌ యజమాన్యం నాలుగు బస్సుల్లో 200 మంది విద్యార్థులు, 30 మంది సిబ్బందిని శనివారం యారాడ విహారయాత్రకు తీసుకెళ్లింది. మధ్యాహ్నం లైట్‌ హౌస్‌ వద్ద భోజనాల అనంతరం విద్యార్థులంతా యారాడ బీచ్ కి బస్సుల్లో బయలుదేరారు. నాలుగు బస్సులు వరుసగా ఘాట్‌ రోడ్‌లో కిందకు దిగుతున్నపుడు మూడో బస్సు బ్రేకులు పనిచేయడం మానేశాయి. దీనిని ఆపడం కోసం ముందు వెళ్తున్న బస్సులను డ్రైవర్లు ఆపారు. దీంతో ఆ బస్సు ముందున్న రెండు బస్సులను బలంగా ఢీకొని ఆగిపోయింది. ఇలా ఆపకపోయి ఉంటే పెనుప్రమాదం జరిగేదని అంటున్నారు. గాయపడిన విద్యార్థులను ఆర్టీసీ బస్సు, అంబులెన్సుల్లో విశాఖలోని కేజీహెచ్‌, అనకాపల్లి, అగనంపూడి, మల్కాపురం ఆసుపత్రులకు తరలించారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ముగ్గురు విద్యార్థులు పరిస్థితి ఒకింత విషమంగా ఉండడంతో వారిని విశాఖ నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్‌, చినరాజప్ప, విశాఖ ఎంపీ హరిబాబు పరామర్శించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం