ఉరి ఉగ్రదాడుల తర్వాత నిద్ర పట్టలేదు -పారికర్


ఉరిలోని ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడి 19 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న ఘటన అనంతరం తనకు రోజుల తరబడి నిద్ర కూడా పట్టలేదని ఆనాటి రక్షణ శాఖా మంత్రి, ఇప్పటి గోవా సీఎం మనోహర్ పారికర్ పనాజీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో చెప్పారు. ఉరి దాడి తర్వాత రెండు వారాల్లోనే సర్జికల్ స్ట్రైక్స్ (మెరుపుదాడులు) నిర్వహించి భారత్ తన దాయాది దేశం పాకిస్థాన్ కి గట్టి గుణపాఠం నేర్పింది. అయితే ఉరి ఉగ్రదాడులు, మెరుపు దాడులకు మధ్యలో ఆర్మీ ఉన్నతాధికారులు, రక్షణ శాఖ అధికారులతో దాదాపు 18 సమావేశాలు నిర్వహించినట్లు పారికర్‌ చెప్పారు. అయితే వీటిలో ఒక్క విషయం కూడా బయటకు పొక్కలేదని చెప్పారు. ఆ సమయంలో తనకు నిద్ర కూడా పట్టలేదని, చాలా ఒత్తిడికి గురయ్యానని అన్నారు. మెరుపు దాడుల విషయంలో అనుకోనిది జరిగితే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో తనకు తెలుసని, అయినప్పటికీ పకడ్బందీ ప్రణాళికతో అత్యంత సాహసంగా ఈ పని పూర్తి చేశామని చెప్పారు. ఉరి దాడికి ప్రతీకారంగా నియంత్రణ రేఖను దాటి సర్జికల్ స్ట్రైక్స్ చేయడం ద్వారా పాకిస్థాన్‌కు మన సైనిక సత్తా రుచి చూపించిన విషయం తెలిసిందే. ఈ దాడులకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ మెరుపు దాడుల వివరాలను, కొన్ని రహస్యాలను పారికర్‌ వెల్లడించారు.మెరుపు దాడుల ప్రణాళికను, వాటి తీరును సైన్యం అంత్యంత గోప్యంగా ఉంచిందని, ఆర్మీ వెల్లడించేంత వరకూ అవి బయటకు రాలేదని చెప్పారు. దాడులకు ముందు ఉన్నతాధికారులు విదేశాలకు వెళ్లి సర్జికల్‌ స్ట్రైక్స్‌కు అవసరమైన ఆయుధాలు, పరికరాల్ని చివరి నిమిషంలో కొనుగోలు చేశారని తెలిపారు. 2016, సెప్టెంబర్‌ చివరివారంలో నియంత్రణ రేఖ దాటి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఏడు ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ మెరుపు దాడులు చేసింది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం