చైనా అక్కసు కొనసాగుతోంది

భారత్ పై చైనా అక్కసు కొనసాగుతోంది. అక్కడి అధికారిక మీడియా భారత్‌ పై విద్వేషాన్ని వెళ్లగక్కింది. భారత్ కి చెందిన డ్రోన్ ఒకటి పొరపాటున వాస్తవాధీన రేఖ దాటడం, ఆ డ్రోన్‌ను కూల్చేశామని ఈ మధ్యే చైనా సైన్యం ప్రకటించడం తెలిసిందే. అయితే ఈ ఘటనలో భారత్‌ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఓ పెద్ద కథనం ప్రచురించి... అందులో భారత్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంద ని దుయ్యబట్టింది. డ్రోన్ ఘటనపై ఇండియా క్షమాపణలు చెప్పి తీరాలని డిమాండ్ చేసింది. భారత, చైనా సైన్యం మోహరింపుల నడుమ ఎక్కడైతే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో సరిగ్గా అదే ప్రాంతంలో డ్రోన్‌ సంచారం చేసింది. అది సమస్యాత్మక ప్రాంతం అని తెలిసి కూడా కవ్వింపు చర్యలు చేపట్టడం దారుణం. మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకూడదని చైనా భావిస్తోంది. కానీ, భారత్‌ సరిగ్గా వ్యవహరించటం లేదు. సాంకేతిక సమస్య అన్న కారణం నమ్మదగినదిగా లేదు. చైనా నుంచి ఇలాంటి ఘటనే ఎదురయితే అంతర్జాతీయ సమాజం దృష్టిలో ఇండియా మమ్మల్ని దోషులుగా నిలబెట్టేది. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేపట్టిన తర్వాత నివేదికతో భారత్‌ వైఖరిని ఎండగడతాం’’ అని ఆ కథనంలో పేర్కొంది. భారత సైన్యం ఈ ఘటనపై ఇప్పటికే వివరణ ఇచ్చింది. ఇజ్రాయెల్‌ రూపొందించిన హోరోన్‌ అనే ఈ డ్రోన్‌ ని భారత్‌-చైనా సరిహద్దులోని కొండ ప్రాంతాల్లో నిఘా పర్యవేక్షణ కోసం వినియోగిస్తున్నారు. సాంకేతిక సమస్య తలెత్తటంతో అది సరిహద్దును దాటిందని భారత ఆర్మీ స్వయంగా చైనాకి సమాచారం ఇచ్చింది. 
 

Facebook