గుజరాత్ లో బిజెపి సీట్లు 150


గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమాగా ఉన్నారు. హిమాచల్‌లో మూడింట రెండొంతుల మెజార్టీ, గుజరాత్‌లో 150కన్నా అధిక స్థానాలు తమకు వస్తాయని ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. గుజరాత్ లో హార్దిక్‌ పటేల్‌ ప్రభావం ఏమీ ఉండదని, పాటీదార్లు బిజెపి వైపే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తల్లీబిడ్డల వంటి పాటీదార్లను, బిజెపిని వేరు చేయలేరన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 10% రిజర్వేషన్లు అని పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి ప్రచారం చేస్తున్నా ఇది రాజ్యాంగబద్ధం కాదని స్పష్టం అయిందని చెప్పారు. రాజకీయంగా తటస్థంగా ఉంటామని చెప్పినందుకే కొందరు కుల నేతల్ని గుజరాతీలు ఆదరించారని, ఇప్పుడు వారంతా కాంగ్రెస్‌కు మద్దతు తెలపడంతో నిజస్వరూపం బహిర్గతం అయిందని తెలిపారు. కాంగ్రెస్‌ 22 ఏళ్లుగా గుజరాత్ లో ధికారంలో లేనప్పటికీ వారి ఓటు బ్యాంకు ఎప్పుడూ 38 శాతానికి తగ్గలేదని, ఆ పార్టీ సంప్రదాయ మద్దతుదారులు, వారికి తోడు ఈ ముగ్గురు యువనేతల హడావుడి తప్ప కాంగ్రెస్ ప్రభావం ఏమీ లేదని అమిత్ షా కొట్టి పారేశారు. రాహుల్ గాంధీ ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ఇదే రీతిలో ప్రచారం చేశారు. కాంగ్రెస్‌కు ఏడు సీట్లు వచ్చాయి అని గుర్తు చేసారు అమిత్. భాజపా ప్రభుత్వం రైతుల కోసం విశేషంగా కృషి చేసిందని, 1995లో పంట రుణాలపై 17% వడ్డీ ఉండగా, ఇప్పుడు సున్నా అయిందని చెప్పారు. ఇప్పుడు 24 గంటలూ విద్యుత్ ఇస్తున్నామన్నారు. గత అయిదేళ్లలో 21 ఆనకట్టలు, 48 సరస్సులు, 174 చెక్‌డ్యాంలు నిర్మించాం అని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎన్నికలను జీఎస్టీపై ప్రజాభిప్రాయ సేకరణగా భావిస్తే ఆ సవాలును స్వీకరించడానికి తామూ సిద్ధంగా ఉన్నాం అని తెలిపారు. జీఎస్టీని అమలు చేయడానికి ముందే డిసెంబరులో ఎన్నికలు అనే విషయం తమకు తెలుసనీ, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉంటే ముందుగానే జీఎస్టీని తెచ్చేవాళ్లం అనీ చెప్పారు. జీఎస్టీని కేవలం ఆర్థిక అంశంగానే పరిగణించాం అన్నారు. పెద్ద సంస్కరణ చేపట్టినప్పుడు సర్దుకోవడానికి కొంతసమయం పడుతుందని, రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా మోదీ ప్రభుత్వం దీనిపై ముందుకెళ్లిందని అన్నారు. రాహుల్‌ గాంధీ ఏ ఆలయాన్ని దర్శించినా మాకు అభ్యంతరం లేదు. అది ఆయన హక్కు. తన పేరు హిందూయేతరుల రిజిస్టర్‌లో రాశారంటూ టీవీ చానెల్‌ ప్రసారం చేసింది. ఇలా ఎవరు రాశారో వెల్లడించాలనే మేం కోరాం. అని చెప్పారు. మీరు, మోడీ ఇద్దరూ గుజరాత్ లో ఉండరు కదా... మరి మీ ప్రభావం ఉంటుందా అని అడిగిగితే అమిత్ షా జవాబిస్తూ.. తాము ఇటలీ వెళ్లిపోలేదు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రధానిగా మోదీ గుజరాత్‌ కోసం మరింత సమర్థంగా పనిచేస్తున్నారని ప్రజలకు తెలుసునని చెప్పారు. గత 22 ఏళ్లుగా మా ప్రభుత్వాలు అద్భుత పనితీరు కనబరిచాయి. అంచేత ప్రభుత్వ వ్యతిరేకత అన్నది లేకపోగా.. ప్రభుత్వ అనుకూలత నెలకొంది అని చెప్పారు. జాతీయవాదులు బలపడకుండా అడ్డుకోవడం ఎవరికీ తగదని.. భాజపాను జాతీయవాద శక్తి అని పిలిస్తే దాన్ని స్వాగతిస్తాం అని చెప్పారు. జాతీయవాదం ఉండడం వల్లనే భాజపా అన్ని మతాలకూ సహాయం అందిస్తోందన్నారు. ఇరాక్‌లో జిహాదీల చేతిలో బందీలైన నర్సులను, యెమన్‌లో ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదుల చెరలో ఉన్న క్రైస్తవ మతాచార్యుడిని కాపాడామని.. దీని వెనుక తాము జాతీయ వాదాన్ని చూశామని అమిత్ స్పష్టం చేసారు.

ముఖ్యాంశాలు