డిపాజిట్లకు నాది హామీ అంటున్న జైట్లీ


బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో ప్రజల డిపాజిట్లకు భద్రత కల్పిస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. ‘ఫైనాన్షియల్‌ రిజుల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూ రెన్స్‌(ఎఫ్‌ఆర్‌డీఐ) బిల్లును ప్రభుత్వం రూపొందించిన సంగతి తెలిసిందే. సంయుక్త పార్లమెంటరీ సంఘం పరిశీలనలో ఉన్న ఈ బిల్లును అవసరమైన సవరణల అనంతరం, వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సన్నా హాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ‘బెయిల్‌-ఇన్‌’ నిబంధనపై డిపాజిటర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు దివాలా తీస్తే అందులో దాచుకున్న సొమ్ము తిరిగి రాదని వార్తలు వస్తున్న నేపథ్యంలో అరుణ్‌జైట్లీ మాట్లాడారు. ‘బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో ప్రజలు చేసిన డిపాజిట్లకు పూర్తి భద్రత కల్పిస్తాం. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారానికి భయపడవద్దు’ అని భరోసా ఇచ్చారు. బ్యాంకులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రూ.2.11లక్షల కోట్ల మూలధనాన్ని ఇవ్వనుందని, దివాలా తీయడానికి ఆస్కారమే లేదన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే ‘మీ డిపాజిట్లకు ప్రభుత్వం పూర్తి భద్రత’ కల్పిస్తుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉందన్నారు. మరోపక్క ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లుపై తీవ్ర దుమారం రేగుతోంది. అది డిపాజిటర్లను ఇబ్బంది పెట్టదని, మరింత రక్షణ కల్పిస్తుందని ఆర్థికశాఖ పేర్కొన్నా, వ్యతిరేకత మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా ‘బెయిల్‌-ఇన్‌’ నిబంధనను అందరూ వ్యతిరేకిస్తు న్నారు. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు డిపాజిటర్ల డబ్బును ఉపయోగించుకునేం దుకు ఈ నిబంధ‌న‌తో అవకాశం ఏర్పడుతుంది. డిపాజిట్ల కాలావధిని మార్చవచ్చు. లేదంటే డిపాజిట్‌ మొత్తంలో కొంత భాగాన్నే తిరిగి ఇవ్వవచ్చు. లేదా మొత్తంగా నిలిపివేయవచ్చు.