భారత్ - రష్యా మధ్య అత్యంత కీలక రక్షణ ఒప్పందం


భారత సైన్యం అమ్ముల పొదిలోకి మరో అధునాతన ఆయుధ వ్యవస్థ చేరనుంది. రష్యన్‌ ఎస్‌-400 ట్రయంప్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ విక్రయ ఒప్పందంపై భారత్‌, రష్యా త్వరలోనే సంతకాలు చేయనున్నాయి. దీనిపై చర్చలు తుది దశకు చేరుకుంటున్నట్టు రష్యా రక్షణ, పరిశ్రమల బృందం (రోస్‌టెక్‌) సంచాలకుడు విక్టర్‌ ఎన్‌ క్లదోవ్‌ వెల్లడించారు. ప్రస్తుతం భారత్‌ ఎన్ని ఎస్‌-400లను కొనుగోలు చేస్తుందన్న అంశంపైనే చర్చలు సాగుతున్నాయని వివరించారు. ధర, శిక్షణ, సాంకేతికత బదిలీ, నియంత్రణ వ్యవస్థల ఏర్పాటు గురించి ఇప్పుడు చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎస్‌-400ను సరఫరా చేసినా వ్యవస్థ గురించి శిక్షణ ఇచ్చేందుకు రెండేళ్లు పడుతుంది. అప్పుడే వీటిని ఉపయోగించగలరు’ అని క్లదోవ్‌ తెలిపారు. రష్యా నుంచి ఐదు బిలియన్‌ డాలర్లతో ఎస్‌-400 ట్రయంప్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ కొనుగోలు చేస్తామని గతేడాది అక్టోబర్‌లో భారత్‌ ప్రకటించింది. దాంతోపాటు రెండు దేశాలు సంయుక్తంగా కమోవ్‌ హెలికాఫ్టర్ల తయారీ చేపడతాయని పేర్కొంది. గోవాలో బ్రిక్స్‌ దేశాల సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో చర్చించిన తర్వాత ఈ ఒప్పందం గురించి ప్రకటించారు. ఈ ఒప్పందం ఎందుకు అత్యంత కీలకం అంటే ఎస్‌-400 ట్రయంప్‌ లాంగ్‌రేంజ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ క్షిపణి వ్యవస్థ అత్యంత శక్తిమంతమైంది. ఆకాశంలో 400 కిలోమీటర్ల పరిధిలో దూసుకొచ్చే శత్రుదేశాల యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్‌లను ఇది నాశనం చేయగలదు. దీంతో మొత్తం మూడు క్షిపణులను ప్రయోగించవచ్చు. రక్షణ పొరలాంటిది సృష్టించి ఒకేసారి 36 లక్ష్యాలకు ఇది గురిపెట్టగలదు. ఈ ఒప్పందం కుదిరి ఎస్‌-400లు భారత్‌ చేరితే ఆసియా ప్రాంతీయ రాజకీయాల్లో ఇదొక కీలక మలుపు అవుతుంది. చైనా, పాకిస్థాన్‌ల వైఖరిలో వెనువెంటనే పెనుమార్పులు సంభవించవచ్చు. శత్రుదేశాల క్షిపణుల నుంచి దేశంలోని ముఖ్య నగరాలు నాశనం కాకుండా దీనితో భారత్ రక్షణ ఛత్రం ఏర్పాటు చేయవచ్చు. ఇలాటి వ్యవస్థ అమెరికా వద్ద కూడా లేదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యాంశాలు