హై హై నాయకా..! పోలవరంపై బాబు పంచ్ డైలాగ్స్!


అందుకే చంద్రబాబు నిజమైన రాజకీయ వేత్త. ఆఖరి క్షణం వరకూ అవకాశం వదలని పట్టు ఆయనది. పోలవరం పై కేంద్రంతో ఏర్పడిన ప్రతిష్టంభన విషయంలో కేంద్రాన్ని ఎంత బ్యాడ్ చేయాలో అంతా చేసిన తర్వాత... కేంద్రం సుస్పష్టంగా చెప్పిన వైఖరికి అయన తలొగ్గిన సంగతి విదితమే. అయితే అందులోనూ తన పైచేయిని ఆయన ఎంత చాకచక్యంగా ప్రదర్శిస్తున్నారో చూడండి. కింద పడినా గెలుపు నాదే అనేవారికి బాబు ఆదర్శం...! జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని ఈయనే పూర్తి చేస్తారుట! పోలవరంపై తనకు ఇంకా తెలియని విషయాలున్నాయని ఆయన చెప్పుకోవడం నిరాడంబరత కావచ్చు గానీ కేంద్రానికి, జగన్ కి, పవన్ కి ఏమీ తెలియదని అనడం అహంకారం కిందికే వస్తుంది. అసలు పోలవరంపై ఆయన వ్యాఖ్యల్లో కొన్ని చూడండి. ఎక్కడైనా ఇదో జాతీయ ప్రాజెక్ట్ అని గానీ, కేంద్రం డబ్బు ఇస్తున్నదని గానీ... ఇందులో తనకంటే కీలక భూమికను ముందు ప్రభుత్వాలు, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పోషించాయని, పోషిస్తున్నాయని గానీ ఏ కోశాన్నయినా ఆయనకు గుర్తుందా? తానీ పోలవరానికి శంకుస్థాపన చేసి, కాలువలు తవ్వించేసి, ప్రాజెక్ట్ కట్టేస్తుంటే కేంద్రం, జగన్, పవన్ ఊరికే అడ్డుపుల్లలు వేస్తుంటే మాట్లాడినట్టుగా లేవా ఈ మాటలు!? పోలవరం సైట్ తాజాగా సందర్శించి పనులు పరిశీలించిన అనంతరం చంద్రబాబు మీడియా సమావేశంలో, అధికారుల సమావేశంలో చేసిన వ్యాఖ్యల్లో కొన్ని ఇవి. పోలవరంపై ఉడుంపట్టు నాది. వదిలిపెట్టను. ప్రాజెక్టును పూర్తి చేసి తీరతా..’ రూపాయి అవినీతి లేకుండా ప్రాజెక్టును పూర్తి చేస్తా. ఎవరైనా దీని నిర్మాణం పూర్తి చేసేలా సలహాలు ఇస్తే వింటా. అడ్డుకుందామని చూస్తే లెక్కే చేయను అనుభవం ఉన్న నేనే తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది జగన్ ని తీసుకొచ్చి చూపిస్తే ఏదేమిటో తెలుస్తుందా? ఒక్కసారి వచ్చి చూసి (పవన్) ఏదేదో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే ఏమనాలి? ప్రాజెక్టుకు అడ్డుపడేవాళ్లు ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. శాసనసభలో అన్ని వివరాలు చెప్పాం. రోజురోజుకు ఖర్చు మారుతుంటే శ్వేతపత్రం ఎలా తెమ్మంటారు? ఎప్పటికప్పుడు అన్నీ పారదర్శకంగా వెల్లడిస్తున్నాము. అంచనాలు పెరుగుతున్నాయని గోల చేస్తున్నారు. ఇందులో భూసేకరణ పునరావాస వ్యయమే 11 రెట్లు పెరిగింది. గోదావరి- వంశధార, గోదావరి- కృష్ణా, పెన్నా అనుసంధానంపై కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఇప్పటికే గోదావరి కృష్ణా అనుసంధానం పూర్తయింది. పైపులైన్ల ద్వారా నాలుగు నదుల నీటిని అనుసంధానించేందుకు అవకాశాలు పరిశీలిస్తున్నాం. గడ్కరీ తమిళనాడు లోని కావేరికి కూడా గోదావరి నీటిని అనుసంధానిద్దామంటున్నారు. తెలుగువారి అవసరాలు తీరాక ఇతర రాష్ట్రాలకు నీళ్లిచ్చేందుకు అభ్యంతరం లేదని చెప్పాం. సంక్రాంతి నాటికి ఒక్క గేటు అయినా స్పిల్‌వేకు ఏర్పాటుచేయాల్సిందే. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌, సలహాదారు కన్నయ్యనాయుడు, అధికారులు మరో ముగ్గురితో కమిటీ వేసుకుని అందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రధానడ్యాం నుంచి కాలువలకు అనుసంధానంగా చేపడుతున్న పనుల్లో 65వ ప్యాకేజీకి టెండర్లు పిలవాలి. డయాఫ్రంవాల్‌, జెట్‌ గ్రౌటింగు పనులు సాగుతున్నా కాంక్రీటు పనుల్లో వేగం పెంచాలి. పోలవరంలో గుత్తేదారు కోరుతున్న రాయితీల వ్యవహారంతో పాటు ఆర్థిక సమస్యలను త్వరగా పరిష్కరించాలి. దీనిపై ఏర్పాటైన త్రిసభ్య సంఘం మార్గదర్శకాలు రూపొందించాలి. కేంద్ర మంత్రి గడ్కరీ ఒక ప్రయత్నం చేయమన్నందున ఈ అంశంపై తార్కిక ముగింపునకు రావాలి.

ముఖ్యాంశాలు