1,581మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై 13,500 కేసులు


ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులు విచారించేందుకు 12 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కొంత గడువు ఇస్తే వారిపై గల కేసుల సమాచారం సేకరించి విచారణ వేగవంతం చేస్తామని మంగళవారం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. 2014 వరకు అధికారంలో ఉన్న, ప్రస్తుతం పదవుల్లో కొనసాగుతున్న మొత్తం 1,581మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై 13,500 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇలా నేర చరిత్ర ఉన్నవారే మళ్లీ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా రు. వీరి సంఖ్య ఏటా పెరుగుతున్నది తప్ప తగ్గడంలేదు. కేసులు కూడా పరిష్కారం కాకుండా పేరుకుపోతున్నాయి. దీనికి పరిష్కారం ఏమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో మంగళవారం కోర్టుకు కేంద్రం వివరణ ఇచ్చింది. 12 ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేయడమే కాకుండా అవి పనిచేసేందుకు మొత్తం రూ.7.80 కోట్లను కేటాయిస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు సేకరించి ఇచ్చేందుకు కొంత గడువు ఇవ్వాలని కోరింది. ఈ గడువులో అసలు ప్రత్యేక కోర్టులు ఎన్ని అవసరం అవుతాయనే విషయంలో కూడా ఒక స్పష్టత వస్తుందని కేంద్రం తెలిపింది.

ముఖ్యాంశాలు