ఈసారి ఉద్యమం కేజ్రీవాల్ ను పుట్టించదు!


‘నా ఉద్యమం నుంచి మరో కేజ్రీవాల్‌ పుట్టడు’ అని సామాజిక కార్యకర్త అన్నా హజారే అన్నారు. 2011లో అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక ప్రాత పోషించిన విషయం, ఆ తర్వాత కేజ్రీవాల్‌ ఉద్యమం నుంచి విడిపోయి రాజకీయాల్లోకి రావడం తెలిసిందే. సామాన్యుల కోసం అంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ పెట్టి దిల్లీ ముఖ్యమంత్రి కాగలిగారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేజ్రీవాల్‌ రాజకీయవాదిగానే మారిపోయారని అనేకసార్లు హజారే ఆరోపించారు. తాజాగా ఆగ్రాలో జరిగిన ఓ సమావేశానికి హాజరైన హజారే మరోసారి కేజ్రీవాల్‌పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఇకపై తన ఉద్యమం నుంచి మరో కేజ్రీవాల్‌ పుట్టడని, ఆ నమ్మకం తనకుందని అన్నారు. జన్‌లోక్‌పాల్‌ బిల్లు గురించి ప్రస్తావిస్తూ అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్‌ను దుమ్మెత్తి పోశారు. పెట్టుబడిదారుల ప్రభుత్వాన్ని మేం కోరుకోవట్లేదు. మోదీ, రాహుల్‌ ఇద్దరూ వద్దు. రైతుల ప్రయోజనాల కోసం పనిచేసే ప్రభుత్వం కావాలి.. అన్నారాయన.