గుజరాత్ లో జబర్దస్త్ విజయం - రాహుల్


గుజరాత్‌లో అధికార భాజపాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని రాహుల్‌ గాంధీ అభిప్రాయపడ్డారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‘జబర్దస్త్‌’ విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వానికి మంగళవారం తెరపడింది. ఈ సమయంలో రాహుల్‌ అహ్మదాబాద్‌లో విలేకర్ల సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా తన పేరు ఖరారయ్యాక ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడటం ఇదే తొలిసారి. పాటీదార్లు, ఓబీసీలు, దళితులు, రైతులు అనే తేడా లేకుండా గుజరాత్‌లో అన్నివర్గాల ప్రజలు భాజపాపై ఆగ్రహంతో ఉన్నారని రాహుల్‌ అన్నారు. గుజరాత్‌ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే మంగళవారం మోదీ నీటి విమానంలో ప్రయాణించారని ఆరోపించారు. తాను ఆలయాలను సందర్శించడంపై భాజపా నేతలు విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. మన్మోహన్‌పై ఆరోపణలు ఆమోదయోగ్యం కావని రాహుల్ మండిపడ్డారు. గుజరాత్‌ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఇతర కాంగ్రెస్‌ నేతలు పాకిస్థాన్‌తో చేయి కలిపారంటూ మోదీ చేసిన ఆరోపణలు సిగ్గుచేటని రాహుల్‌ పేర్కొన్నారు. దేశ రాజకీయాలు హీనంగా మారాయని, తాను కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఈ పరిస్థితులను మార్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. కాగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌పై ప్రధాని నరేంద్రమోదీ చేసిన ఆరోపణలను పలువురు రాజకీయ నాయకులు విమర్శించారు. మన్మోహన్‌పై మోదీ ఇలాంటి విమర్శలు చేయడం సిగ్గుచేటు అంటూ ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ ఖండించారు. ఇది ప్రధాని పదవినే అగౌరవపరచడమంటూ పేర్కొన్నారు. గుజరాత్‌ ఎన్నికల్లో పాకిస్థాన్‌ ప్రస్తావనను శివసేన ఖండించింది.

ముఖ్యాంశాలు