నిన్నటిదాకా విమర్శలు.. నేడు పలకరింపులు


ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకోవడం ఎన్నికల ప్రచారం గడువుతో పాటే ముగియడంతో ప్రత్యర్థి పార్టీల అగ్రనేతలు నవ్వు మొహాలతో పలకరించుకున్నారు. పాక్‌ అధికారులతో రహస్యంగా సమావేశమయ్యారని ఒకరు విమర్శిస్తే, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ తో దేశాన్ని నాశనం చేసారని మరొకరు దుమ్మెత్తి పోశారు. ఇదంతా గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జరిగింది. ఆ విమర్శలు చేసుకున్న నేతలు ఎవరో తెలుసునా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్..! ఇప్పుడు వారిద్దరూ ఒకరికొకరు ఎదురుపడి కరచాలనం చేసుకుంటూ నవ్వుతూ మాట్లాడుకున్నారు. దిల్లీలోని పార్లమెంటు ఆవరణలో ఈ ఉల్లాసకరమైన దృశ్యం కనిపించింది. 2001లో పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్‌ నూతన అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌, రవిశంకర్‌ప్రసాద్‌ తదితరులు హాజరై అమర వీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోదీ, మన్మోహన్‌ కరచాలనం చేసుకొని పలకరించుకొన్నారు. కేంద్రమంత్రులు సుష్మా, రవిశంకర్‌ప్రసాద్‌ రాహుల్‌ నవ్వుతూ కబుర్లాడుకోవడం కనిపించింది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం