యుపిఎ హయాంలో బ్యాంకులు సర్వనాశనం


ప్రస్తుతం నడుస్తున్న బ్యాంకింగ్‌ సంక్షోభానికి యూపీఏ ప్రభుత్వ అసమర్థ విధానాలే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. నచ్చిన వారికి రుణాలిప్పించేందుకు అప్పట్లో బ్యాంకులపై ఒత్తిడి తీసుకొచ్చారన్నారు. 2జీ, బొగ్గు, కామన్‌వెల్త్‌ గేమ్స్‌ కుంభకోణాల కన్నా బ్యాంకు ల దుర్వినియోగం అతి పెద్ద కుంభకోణం అని మోదీ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఫిక్కీ 90వ వార్షిక సర్వసభ్య సమావేశంలో మోదీ మాట్లాడు తూ ‘నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ), మొండి బకాయిల సమస్యలను గత ప్రభుత్వంలోని ఆర్థికవేత్తలు మాకు వారసత్వంగా అందించారు’ అని విమర్శించారు. తమ ‘పార్టీకి సన్నిహితంగా ఉండే వ్యాపార, పారిశ్రామిక వేత్తలకు భారీగా రుణాలిప్పించారని ఆరోపించారు. బ్యాంకుల ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితికి గత ప్రభుత్వ విధానాలు ఎలా కారణమయ్యాయనే దానిపై ఫిక్కీ వంటి సంస్థలు అధ్యయనం చేయలేదన్నారు. ప్రభుత్వం, బ్యాంకులు, మార్కెట్‌లు, పరిశ్రమల్లో ఉన్న వారందరికీ యూపీఏ ప్రభుత్వ తప్పిదాలు తెలుసునని చెప్పారు. పారిశ్రామికవేత్తలను అడ్డంపెట్టుకుని ప్రజాధనాన్ని ఇష్టమొచ్చినట్లు లూటీ చేశారని విమర్శించారు. పారిశ్రామిక రంగం డిమాండ్‌ చేస్తున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను తాము తీసుకొచ్చామని, యాంటీ –ప్రాఫిటీరింగ్‌ (జీఎస్టీ తగ్గడంతో వచ్చే లాభాలను పంచటం) ద్వారా ఆ ప్రయోజనాలు ప్రజలకు చేరేలా పరిశ్రమలు చొరవ తీసుకోవాలన్నారు. బ్యాంకు వినియోగదారులు, వారి డిపాజిట్లను కాపాడే విధంగానే తమ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు