సోనియా రిటైర్ కాలేదు... ప్రియాంక పోటీ చేయరు


రాహుల్ కి పగ్గాలు అప్పగించిన తరుణంలో తాను రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటానని సోనియాగాంధీ వ్యాఖ్యానించడంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రియాంక వాద్రా పోటీచేస్తారన్న వూహాగానాలు వూపందుకున్నాయి. అయితే దీనిపై ప్రియాంక స్పందించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి పోటీచేసే అంశంపై ఓ ఆంగ్ల మీడియా సంస్థతో మట్లాడుతూ రాయ్‌బరేలీ నుంచి సోనియాగాంధీనే పోటీచేస్తారని, తాను పోటీ చేసే ఉద్దేశమేదీ లేదని స్పష్టంచేశారు. దీంతో ప్రియాంకపై వచ్చిన వూహాగానాలకు తెరపడినట్లయ్యింది. రాహుల్‌ అధ్యక్ష బాధ్యతల స్వీకార కార్యక్రమానికి భర్తతో కలిసి ప్రియాంక హాజరయ్యారు. రాహుల్‌ గాంధీకి పగ్గాలు అప్పగించిన అనంతరం నిర్వర్తించబోయేబాధ్యతేంటి? అని సోనియాగాంధీని శుక్రవారం ప్రశ్నించినప్పుడు ‘ఇక విశ్రాంతి తీసుకోవడమే’ అంటూ బదులిచ్చారు. దీంతో ఆమె ఇక ఎన్నికల్లో పోటీ చేయబోరన్న ప్రచారం ఊపందుకుంది. ఆ స్థానం నుంచి ప్రియాంక వాద్రా పోటీ చేస్తారన్న వార్తలు గుప్పుమన్నాయి. సోనియాగాంధీ వ్యాఖ్యలపై ఆ పార్టీ వివరణ ఇచ్చింది. ఆమె రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ట్వీట్‌ చేశారు.

ముఖ్యాంశాలు